1 Nenokkadine: వెండితెరపై ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు సుకుమార్. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా, ఆ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహిస్తారు. కానీ ‘1 నేనొక్కడినే’ చిత్రానికి దానికి భిన్నంగా ప్లాన్ చేశాం. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ టికెట్స్ ఇచ్చి థియేటర్లలో ఏకకాలంలో లైవ్ లింక్స్ ఏర్పాటు చేసి, అభిమానులతో హీరో మహేష్ బాబు నేరుగా ఇంటరాక్ట్ అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. అంతా రడీ చేసుకొని హీరో మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి స్టేజ్ మీదకు వెళ్లే టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. “ఇప్పుడు గనుక ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమాకు ఓపెనింగ్స్ రావు.. ఆపేయండి” అని అవతలి వైపు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పడంతో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఆ పరిస్థితిలో ఫ్యాన్స్ ముందుకు వెళ్లి ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని చెప్పడం మామూలు విషయం కాదు.
ఏది ఏమైనా చివరికి అనుకున్న విధంగా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత.. హీరోకు ఒక మానసిక సమస్య (జబ్బు) ఉంటుందని తెలియగానే అప్పటికే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో సగానికి పైగా నిరాశకు లోనయ్యారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ‘1 నేనొక్కడినే’ చిత్రం నేటికీ తెలుగు సినిమాలో ఒక క్లాసికల్‌గా నిలిచిపోయింది.
READ ALSO: TFCC: ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..