కాపాడాల్సిన పోలీసులే తనిఖీల పేరిట మహిళలపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలపై అత్యాచారం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ బాధితులకు 31 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఒకేసారి 215 మందికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇది 1992 నాటి ఘటన. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్ కొండప్రాంతంలో జరిగింది ఈ అమానుష ఘటన. కల్వరాయన్ కొండప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ఉంది వాసాత్తి అనే చిన్న గ్రామం. గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందంటూ 1992 జూన్ 20వ తేదీన పోలీసులు తనిఖీలకు వచ్చారు. 1992 జూన్ 20వ తేదీన 155 మంది అటవీసిబ్బంది, 108 మంది పోలీసులు, ఆరుగురు రెవెన్యూశాఖ అధికారులు కలిపి మొత్తం 269 మంది ప్రతి ఇంటికీ వెళ్లి తనిఖీ చేశారు. తమ సోదాల్లో కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు 90 మంది మహిళలతో సహా 133 మందిపై కేసు నమోదుచేశారు. అంతటితో ఆగని పోలీసులు ఈ వంక దొరికింది కదా అని తమ ఇష్టారీతిన ప్రవర్తించారు.
Also Read: Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ రసం తాగితే.. ఊహించని ఫలితాలు మీ సొంతం..
గ్రామ ప్రజలను చిత్ర హింసలకు గురిచేసిన పోలీసులు 18 మంది గిరిజన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు ఆరూర్ పోలీసులను ఆశ్రయించినా తామంతా ఒకటే అన్నట్లు వారు కేసు నమోదు చేయలేదు. తరువాత బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. పోలీసులపై కేసు నమోదు చేసినా విచారణ ముందుకు సాగకపోవడంతో దీనిని సీబీఐకి అప్పగించాలని బాధితులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దాంతో 1995 ఫిబ్రవరి 24వ తేదీన ఈ కేసు సీబీఐకి బదిలీ చేసింది ధర్మాసనం. దర్యాప్తులో భాగంగా వాసాత్తిలో విధ్వంసం సృష్టించిన మొత్తం 269 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చివరకు ధర్మపురి జిల్లా కోర్టు 2011 సెప్టెంబరు 29వ తేదీన తీర్పు వెలువరించింది.
269 మంది నిందితుల్లో తీర్పు వెలువరించేనాటికి బతికున్న 215 మందిని దోషులుగా తేల్చారు. వారిలో 12 మందికి పదేళ్ల జైలు, ఐదుగురికి ఏడేళ్లు, మిగిలిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేల్‌మురుగన్ ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో 215 మందికి జైలుశిక్ష విధిస్తూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఖరారుచేసింది.అంతేగాక బాధితులైన 18 మంది మహిళలకు తలా రూ.10 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇందులో రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి, రూ.5 లక్షలు నిందితుల నుంచి వసూలుచేయాలని స్పష్టం చేసింది. అంతేగాక నాటి ధర్మపురి జిల్లా కలెక్టర్, ఎస్పీ, అటవీశాఖ అధికారిపై కఠినచర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. ఇక ఒకే కేసులో ఇంతమందికి శిక్షపడడం దేశచరిత్రలో ఇదే ప్రథమం. అదీ ఘటన జరిగిన మూడు దశాబ్దాల తరువాత ఇంతమందికి శిక్ష ఖరారు చేయడం అరుదైన ఘటనగానే పేర్కొనాలి.