తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. డీఎంకే ప్రభుత్వ మెతకవైఖరి కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇక బీజేపీ చీఫ్ అన్నామలై అయితే డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థిని సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. బాధితురాలి పేరు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలోకి వచ్చిందన్నారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్‌లో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక, బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పరిణామాల కారణంగా విద్యార్థిని చదువుపై ఎలాంటి ప్రభావం పడకూడదని తెలిపింది. ఆమె నుంచి ఫీజు వసూలు చేయొద్దని అన్నా యూనివర్సిటీని ధర్మాసనం ఆదేశించింది.
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని డిసెంబరు 23న రాత్రి తన స్నేహితుడితో కలిసి వర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ఫొటోలు తీసి.. పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు. అయితే తనకు జరిగిన ఘోరాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టి ఓ యువకుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే మరో నిందితుడికి డీఎంకేతో సంబంధాలున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అతడిని ప్రభుత్వమే కాపాడుతుందని విపక్షాలు ధ్వజమెత్తాయి.
విపక్షాల ఆరోపణలను డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళల హక్కుల కోసం డీఎంకే కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారని.. అందుకే తక్షణ చర్యలకు ఆదేశించాలని కనిమొళి తెలిపారు.
Thoothukudi, Tamil Nadu | On alleged sexual assault of a student inside Anna University campus, DMK MP Kanimozhi Karunanidhi says, "…The Chief Minister has ordered action against the culprit without any bias. Accordingly, the accused has been arrested and action has been… pic.twitter.com/ktTkpsyJrz
— ANI (@ANI) December 28, 2024