దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం మరోసారి హీటెక్కుతోంది. ఎన్నికల ముంగిట ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే సన్నద్ధమైపోయింది. ఆయా స్కీమ్‌లు ప్రకటించుకుంటూ వెళ్లిపోతుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం, మహిళలకు నెలకు రూ.2,100 నగదు సాయం వంటి పథకాలను ప్రకటించింది. ఇందుకోసం ఇంటింటా తిరుగుతూ ఆప్ శ్రేణులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయ దుమారం రేపుతోంది. వ్యక్తిగత వివరాలు సేకరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)
ఆప్ పథకాలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎల్జీ వీకే.సక్సేనా విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌కు వేర్వేరు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సమ్మాన్ యోజన పేరుతో ఆమ్ పార్టీ నేతలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇంటింటికి పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెళ్తున్నారని.. అంతేకాకుండా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పంజాబ్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ అవుతోందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2,100 చెల్లింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎన్‌రోల్‌మెంట్ పేరుతో ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై డివిజనల్ కమిషనర్ ద్వారా విచారణ జరిపించాలని ఎల్జీని కోరారు. అనధికార రిజిస్ట్రేషన్ క్యాంపులను నిర్వహించడం ద్వారా.. పౌరుల గోపత్యను తెలుసుకునేవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేయగా.. ఆ మేరకు వీకే.సక్సేనా దర్యాప్తునకు ఆదేశించారు.
ఇక కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు మకాం వేశారని కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేసి మూడు రోజుల్లో వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీస్ కమిషనర్‌కు ఎల్జీ ఆదేశించారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి నగదు దిగుమతి అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఎల్జీ ఆదేశించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలపై ఆప్ ధ్వజమెత్తింది. ఈ ఉత్తర్వు ఎల్జీ కార్యాలయం నుంచి రాలేదని.. అమిత్ షా కార్యాలయం నుంచి వచ్చిందని పేర్కొంది. మహిళలంటే గౌరవం లేదని.. మహిళా సమ్మాన్ యోజనను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించిందని.. ఈసారి బీజేపీకి డిపాజిట్లు గల్లంతవుతాయని ఆప్ పేర్కొంది. ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కేంద్రం.. ఎల్జీని పావుగా ఉపయోగించుకుంటుందని ధ్వజమెత్తింది. ఆప్‌పై వచ్చిన ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఏం దర్యాప్తు చేస్తారో చూస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bank Holidays In January: 2025 జనవరిలో దాదాపు 15 రోజులు బ్యాంక్ సెలవులు..