Suresh Balu Dhanorkar: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్(47) మంగళవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే తెలిపారు. ధనోర్కర్ మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో శివసేన పార్టీలో ఉండి.. 2014లో వరోరా-భద్రావతి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2019లో శివసేన పార్టీని వీడి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చంద్రాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత హన్సరాజ్ అహిర్‌పై విజయం సాధించారు.
Read Also: Gehlot vs Pilot: అశోక్, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు
వైద్య చికిత్స నిమిత్తం మే 28న నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి విమానంలో ధనోర్కర్‌ను తరలించినట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. కడుపునొప్పి రావడంతో ఎయిర్ అంబులెన్స్‌లో దేశ రాజధానికి తరలించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటేరియన్ మే 27న నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లతో చికిత్స పొందారని ప్రకటన పేర్కొంది. చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మే 27న, ధనోర్కర్ తండ్రి నారాయణ్ ధనోర్కర్ దీర్ఘకాలిక అనారోగ్యంతో నాగ్‌పూర్‌లో మరణించారు. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు ఎంపీ హాజరు కాలేదు.