దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవలే ఆయా రాష్ట్రాల్లో కొందరి అధికారులపై వేటు వేసింది. తాజాగా మరోసారి ఆ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ కొనసాగించింది. ఎన్నికలకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజాగా అస్సాం, పంజాబ్‌లోని జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారుల్ని బదిలీ చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విధుల నుంచి పక్కనపెట్టినట్లు తెలిపింది. అలాగే పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నాన్ ఎన్‌కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలను కూడా ఇతర విభాగాలకు మార్చాలని ఆయా ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం సూచించింది.
ఇటీవల పశ్చిమ్ బెంగాల్ డీజీపీతో పాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. వారితో పాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను కూడా బదిలీ చేసింది. ఎన్నికలకు సంబంధంలేని విధులకు డీజీపీ రాజీవ్ కుమార్‌ను బదిలీ చేయాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్‌కు జూనియర్‌గా ఉన్న అధికారిని డీజీపీగా తాత్కాలికంగా నియమించాలని సూచించింది. అనంతరం వెంటనే డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోంశాఖల కార్యదర్శులపైనా ఈసీ వేటు వేసింది. వీరంతా ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మరో చోట విధులను నిర్వర్తిస్తున్నారని పేర్కొంది.
దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇక కేంద్రం పంపిస్తున్న వికసిత్ భారత్ వాట్సాప్ మెసేజ్‌లను తక్షణమే నిలిపివేయాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే కేంద్రం ఈ మెసేజ్‌లను పంపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.