తెలంగాణ రాష్ట్రంలోని బీర్ ప్రియులకు భారీ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు (ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి రానున్నాయి.
అన్ని రకాల బీర్ బ్రాండ్లపై 15 శాతం మేర ధర పెంపునకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీపై 15 శాతం మేర పెంచి బీర్లను విక్రయిస్తారు. దీని ప్రకారం.. కింగ్‌ఫిషర్ లైట్ బీర్ ధర ప్రస్తుతం ఉన్న రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బీర్ ప్రస్తుతం ఉన్న రూ.160 నుంచి రూ.190కి పెరగనుంది. కింగ్‌ఫిషర్ అల్ట్రా, బడ్‌వైజర్, టుబోర్గ్, కార్ల్స్‌బర్గ్, హీనెకెన్, మిల్లర్, హేవార్డ్స్ 5000, రాయల్ ఛాలెంజ్ లాంటి బీర్ల ధరలు పెరగనున్నాయి. బీర్ల ధర సరిగ్గా ఎంత పెరుగుతుంది అన్నది నేడు స్పష్టత రానుంది.