Land Scam: మార్కాపురంలో టీడీపీ నేతల భూకబ్జా బాగోతం బట్టబయలైంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా పేదల నుంచి స్వాధీనం చేసుకున్న భూదందా నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మార్కాపురం పరిధిలోని సర్వే నంబర్ 1119లో వున్న చుక్కల భూములను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుటుంబ తమ పేరు పైకి బదిలీ చేయించుకున్న విషయం బయటకు వచ్చింది. 1924 నుంచి వ్యవసాయ భూములుగా ఉన్న 21 ఎకరాల 3 సెంట్ల భూమిని కందుల నారాయణ రెడ్డి కుటుంబం అక్రమంగా సొంతం చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు భూములపై కందుల నారాయణ కుటుంబానికి చెందినవిగా ఆధారాలు చూపాలని అల్టిమేటం జారీ చేశారు. అయితే వాటిని చూపటంలో కందుల నారాయణ రెడ్డి విఫలం కావడంతో అధికారులు లోతుగా విచారణ జరిపారు.
Also Read: Pawan Kalyan: బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు
ప్రకాశం జిల్లా డోర్నాల మండలం హసనాబాద్ గ్రామస్తులైన బాధితులు ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్‌కు లేఖ రాయడం తో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ తాతల కాలం నాటి భూములను వంశపారంపర్యంగా తాము సాగు చేసుకుంటున్నామని.. అయితే ఈమధ్య కాలంలో కొంతమంది తమకు తెలియకుండా తమ 21 ఎకరాల 3 సెంట్ల భూమిని ఆక్రమించాలనే ఉద్ధేశంతో నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించారని భూయజమాని అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి చెందిన భూమిపై దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని ఫిర్యాదు చేయడంతో కందుల నారాయణ రెడ్డి కుటుంబం భూదందా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ డాక్యుమెంట్లు, వాటిపై జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ భూకబ్జాపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ మొదలైంది. ఈ భూదందాపై సిట్‌తో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు బాధితులు లేఖ రాశారు.