Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ రోజువారీ కూలీ.. ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన రూపాయి నాణేలతో పది వేల డిపాజిట్ మొత్తం చెల్లించాడు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ సమీపంలో మురికివాడలో నివాసం ఉండే మహేంద్రభాయ్ పట్నీతోపాటు ఇతరుల గుడిసెలను అధికారులు గతంలో రెండు సార్లు కూల్చివేశారు. 2010లో దండి కుటీర్ మ్యూజియం నిర్మాణం కోసం, 2019లో అక్కడ ఒక హోటల్ నిర్మాణం కోసం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో నిరాశ్రయులైన 521 మంది నివాసితులు హోటల్ సమీపంలోని ప్రాంతంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వ్యాపారాలు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారంతా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
దీంతో దాదాపు 521 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అందులో మా కుటుంబం ఒకటని మహేంద్రభాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదని వాపోయారు. ఇలాంటి కుటుంబాలు నియోజకవర్గ పరిధిలో చాలా ఉన్నాయని, వారందరికీ న్యాయం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తనకు ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ కూడా లేదని, ఎన్నికల్లో పోటీ చేసిన వారికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరైనందువల్ల జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతా తెరిచినట్లు ఆయన చెప్పారు. గాంధీనగర్ నార్త్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేంద్ర పట్నీ ఈ వారం ప్రారంభంలో సెక్యూరిటీ డిపాజిట్‌ను నాణేలలో చెల్లించారు.గాంధీనగర్‌లోని మహాత్మా మందిరం సమీపంలోని మురికివాడలో మూడేళ్ల క్రితం కూల్చివేయబడిన 521 గుడిసెల నిర్వాసిత నివాసితులు తమ ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీలో నిలబెట్టారు.
ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తూ ఓట్ల కోసం తిరిగిన నేతలు ఎన్నికల అనంతరం కనిపించడం లేదు. అందుకే తమ ప్రతినిధిగా మహేంద్రభాయ్ పట్నీని ఎన్నికల్లో నిలబెట్టారు. అంతా కలిసి పది వేల వరకు రూపాయలను నాణేల్లో సేకరించారు. గాంధీనగర్ నార్త్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మహేంద్రకు ఆ సొమ్మును అప్పగించి ఎన్నికల్లో నిలబెట్టారు. శాశ్వత నివాసంతో పాటు అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పేందుకే ఎన్నికల్లో నిల్చున్నానని స్వతంత్ర అభ్యర్థి మహేంద్రభాయ్ పట్నీ అన్నారు.
Man Hires Killer: ఎంత దుర్మార్గం.. ఆ డబ్బు కోసం కక్కుర్తి పడిన కొడుకు ఏం చేశాడంటే..?
“నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నేను కూలీ కుటుంబానికి చెందినవాడిని,రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్నాను. పెద్ద హోటల్ కోసం 521 గుడిసెలు నేలమట్టం చేయబడ్డాయి. వాటిలో చాలా మందికి ఉపాధి లేకుండా పోయింది. మేము ఒక ప్రాంతానికి మారాము. కానీ అక్కడ తాగునీరు, విద్యుత్ సదుపాయమే లేదు,” అని మహేంద్రభాయ్ పట్నీ తెలిపారు. ప్రభుత్వ ఉదాసీనతతో ఆగ్రహించిన మురికివాడల నివాసులతో పాటు ఇతర దినసరి కూలీలు రూ. 10,000 రూపాయి నాణేల రూపంలో సేకరించి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించేందుకు ఆ డబ్బును తనకు అందించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థలాన్ని కూడా వదిలి వెళ్లాలని స్థానిక అధికారులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని డిమాండ్లు మాత్రమే నెరవేరాలని కోరుతున్న ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేరుస్తే, ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదన్నారు. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీని ఎన్నుకునేందుకు ఓటింగ్ డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు దశల్లో నిర్వహించబడుతుంది. డిసెంబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. గాంధీనగర్ ఉత్తర నియోజవర్గానికి మహేంద్రభాయ్‌తోపాటు 28 అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడతగా డిసెంబరు 5న పోలింగ్ నిర్వహించనున్నారు.