KVP Ramachandra Rao: కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో కేవీపీ కీలక వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడితే.. దేశంలోని ఒక్క ఎంపీ కూడా ఖండించలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్ రావు. రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు..
ఇక, జగన్, పవన్, చంద్రబాబు తమ తమ పార్టీలను ఎందుకు బీజేపీలో విలీనం చేయటం లేదో అర్దం కావటం లేదు అంటూ సెటైర్లు వేశారు కేవీపీ.. బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తటానికి మూడు పార్టీలు తొందర పడుతున్నాయని ఆరోపించారు.. అయితే, వైఎస్ చివరి సందేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అన్నారు.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వైఎస్ కు నిజమైన నివాళి, ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. మరోవైపు.. 2018లో దురదృష్టవశాత్తూ టీడీపీతో కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు..
రాజ్యసభలో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పని చేశానని గుర్తుచేసుకున్నారు కేవీపీ.. రాహుల్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగాల్లో ఎలాంటి వివాదాలు ఇప్పటి వరకు లేవన్న ఆయన.. రాహుల్‌పై ఇప్పుడు కక్షకు ప్రసంగంలో అదానీ ఆస్తుల మీద చేసిన వ్యాఖ్యలే కారణం అన్నారు. అదానీపై రాహుల్ ప్రసంగాలను తొలగించటం చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. మమత బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్ వంటి సీఎంలు తలచుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయగలరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాహుల్ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కేవీపీ రామచంద్రరావు.