సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. GHMCలో కలిపేద్దామా..? మీ అభిప్రాయం చెప్పడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది. సికింద్రబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై తెలంగాణ ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. దీంతో అక్కడ నివసించే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా… ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే దానిని జీహెచ్‌ఎంసీలో కలపాలని స్థానికులు కోరుకుంటున్నారంటున్నారు మంత్రి KTR. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
మంత్రి KTR కామెంట్స్‌పై హర్షం వ్యక్తం చేస్తోంది కంటోన్మెంట్ వికాస్ మంచ్. తమ పోరాటానికి మరింత బలం వచ్చిందంటున్నారు మంచ్ ప్రతినిధులు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని GHMCలో విలీనం చేయడం ఒక్కటే తమ సమస్యలకు పరిష్కార మార్గమంటున్నారు. కంటోన్మెంట్ బోర్డుల రద్దు అంశంపై మూడేళ్లుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా తరచూ రోడ్లు మూసేయడం పెద్ద సమస్యగా మారుతోంది. గతేడాది కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్‌లను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనంపై అభిప్రాయం కోరిందనే ప్రచారం జరిగింది. కానీ… ఆ దిశగా ఇంత వరకూ ఎలాంటి ముందడుగు పడలేదు. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాలను యథతథంగా ఉంచాలంటోంది BJP. ఇప్పుడు మున్సిపల్ మంత్రి KTR స్వయంగా ఈ ప్రస్తావన లేవనెత్తడంతో త్వరలోనే తమ కష్టాలు తీరుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ప్రాంతం వాసులు.