KTR : ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. ఎన్నికల్లో గెలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ హామీల మీద హామీలు గుప్పిస్తుంది. అధికారంలోకి వస్తే తాము ఇది చేస్తాం అది చేస్తామంటూ చెబుతోంది. ఇలా హామీలు ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా లేదా క్యాడర్లో కాన్ఫిడెన్స్ కోసమే ఈ హామీలు ఇస్తున్నారా…?
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జనాల సమస్యలను ఏకరవు పెడుతూ పబ్లిక్ లోకి వెళ్తుంది.. జనాల సమస్యలను ఏకరువు పెడుతూనే పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా వెళుతుంది బి ఆర్ ఎస్. అందుకోసమే పార్టీ క్యాడర్ కు కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటలు చెబుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చే ఎన్నికల తర్వాత చేయబోయే పనుల గురించి బల్లగుద్ది చెప్తున్నారు. హామీల రూపంలో కాకుండా ఆర్డర్ రూపంలోనే చెప్పేస్తున్నారు కేటీఆర్. పార్టీ మీటింగ్ లైనా మీడియా సమావేశాలైన నిరసన కార్యక్రమాల్లో అయినా కేటీఆర్ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా కొన్ని మాటలు చెబుతున్నారు. ఆయన చెప్పే మాటలన్నీ ఇప్పుడు కేడర్ లో ఇటు జనాల్లో చర్చనీయాంశ అంశాలుగా మారాయి.
ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న hcu భూముల విషయంలో కేటీఆర్ గురువారం జరిగిన మీడియా సమక్షంలో ఓ మాట చెప్పారు. hcu భూములు సంబంధించి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆ విషయం తను ఇప్పుడు చెబుతున్నానంటూ ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని అది పబ్లిక్ కి ఉపయోగపడే విధంగా ఎకో పార్క్ చేస్తామని ప్రకటించారు కేటీఆర్. అంతటితో ఆగకుండా ఈ భూముల వేలంలో ఎవరు కూడా పాల్గొనకూడదు అంటూ హెచ్చరించారు. ఎవరైనా భూముల వేలంలో పాల్గొని ఆ భూమి దక్కించుకున్న సరే..తమ అధికారంలోకి రాగానే అది లాక్కుంటామని కుండబద్దలు కొట్టారు కేటీఆర్. ఇది మాత్రమే కాకుండా గతంలో లగచర్ల భూముల విషయంలో కూడా భూసేకరణ రద్దు చేస్తామని తమ అధికారంలోకి రాగానే వెంటనే ఆ పని చేస్తామంటూ హెచ్చరించారు. అంతకుముందే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే అంశం సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేసిన అంశంపై కూడా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాము అధికారంలోకి రాగానే ఇప్పుడు పెట్టిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని చెప్పారు కేటీఆర్. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్ కి పంపిస్తాం అంటూ కూడా కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కూడా దాటలేదు. ప్రతిపక్షంగా గట్టి పాత్ర కూడా బీఆర్ఎస్ పోషించట్లేదని ఒకవైపు విమర్శలు వస్తుంటే మరోవైపు వచ్చేది తమ ప్రభుత్వమే అని.. ఆ ప్రభుత్వంలో ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు బీఆర్‌ఎస్ చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వస్తే చేస్తామని ఎందుకు చెబుతున్నారు అంటూ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ క్యాడర్లో ఉత్సాహం లేపేందుకు కేటీఆర్ మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నారు విశ్లేషకులు.