Kishan Reddy: ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు.
Also Read: Telangana Rains: భారీ వర్షాలపై అప్రమత్తం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు
ఉదయం 7:30 గంటలకు కిషన్‌రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 8:20 గంటలకు అంబర్ పేట మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాల వద్ద నివాళులు అర్పించనున్నారు. 8:50గంటలకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం 9:25 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం, 9:30కి గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తర్వాత అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు తరలిరానున్నాయి.
Also Read: TSSPDCL CMD: వర్షాకాలంలో విద్యుత్‌తో జాగ్రత్త.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
రేపు మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి కిషన్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్టీ నేతలు పాటుపడాలని సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.