Telangana Rains: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. రానున్న 48 గంటలలో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని, అదేవిధంగా దక్షిణ తెలంగాణా జిలాల్లో ఒక మోస్తరు వర్షం ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో, సహాయపడేందుకు వీలుగా వరంగల్, ములుగు, కొత్తగూడెంలలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఉంచామని, అదేవిధంగా హైదరాబాద్‌లోనూ 40 మంది గల ఒక బృందం సిద్ధంగా ఉందని సీఎస్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ విధమైన నష్టం వాటిల్లలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లలేదని, గ్రామీణ ప్రాంతాలలో రహదారుల పరిస్థితి కూడా మెరుగ్గానే ఉన్నాయని వివరించారు.
Also Read: Heavy Rains: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఐదు రోజులు ఇదే పరిస్థితి..!
రాష్ట్రంలోని అన్నిప్రాజెక్టులలోనూ 50 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నందున భారీ వరద వచ్చినా ఇబ్బందులు లేవని ఆమె తెలిపారు. అయినప్పటికీ అన్ని రిజర్వాయర్లు, చెరువుల వద్ద ముందు జాగ్రత్త చర్యలను చేపట్టినట్టు ఆమె తెలియచేశారు. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని.. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న ఈ వర్షాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏ విధమైన అతిసార వ్యాధి, ఇతర అంటూ వ్యాధుల వ్యాప్తి లేదని, అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా, ప్రతీ గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీల్లోని మంచినీటి ట్యాంకులలో విస్తృత స్థాయిలో క్లోరినేషన్ చేపట్టామని వివరించారు. రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరద పరిస్థితిపై సంబంధిత చీఫ్ ఇంజినీర్‌తో సమీక్షించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 426 మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలను, 157 స్టాటిక్ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో ఉన్న 339 నీటి నిల్వ (వాటర్ లాగింగ్ పాయింట్స్) ఉండే ప్రాంతాలపై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. నగరంలోని 185 చెరువులు, కుంటలలో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు.