మనదేశంలో పర్యాటకరంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆదివారం మూడ్రోజుల పర్యాటక మంత్రుల సదస్సు ప్రారంభం అయింది. కరోనానంతర పరిస్థితుల్లో దేశీయ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం రైలు, రోడ్డు, విమాన మార్గాల అనుసంధానతతోపాటుగా ఇతర మౌలిక వసతుల కల్పనను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను పెంచేందుకు పీపీపీ (పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే వివిధ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడుతున్నామన్నారు. విదేశాల్లో పర్యాటక రంగం పీపీపీ పద్ధతిలోనూ పురోగతి సాధిస్తున్నవిషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. భారత్ లోనూ ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని అందించేందుకు కేంద్రం ‘వికాస్ భీ, విరాసత్ భీ’ నినాదంతో ముందుకెళ్తోందన్నారు.
ప్రపంచ జనాభా సదస్సులో 85 శాతం ఉన్నటువంటి జీ-20 దేశాల సదస్సును ఈసారి భారతదేశం నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా మన దేశంలోని వివిద ప్రాంతాల్లో 250 వివిధ శాఖల సదస్సులు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా భారతీయ పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ఆయన అన్నారు. కరోనానంతరం భారతదేశ టీకాను తీసుకొచ్చి పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని, పర్యాటక, ఆతిథ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీడియా కూడా తమవంతు సహాయ, సహాకారాలు అందించాలని కిషన్ రెడ్డి కోరారు.
Read Also: Red Sandal: ముంబై, హర్యానాల్లో భారీగా పట్టుబడ్డ ఎర్ర చందనం
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకముందు దేశంలో 70 విమానాశ్రయాలుండేవని.. ఇప్పుడు ఆ సంఖ్య 140కి పెరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2025 నాటికి 220 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామన్నారు. కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక, ఆతిథ్య రంగాలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ను మార్చి 31, 2023 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించిందని, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ లో రూ.50వేల కోట్లను పెంచిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీని ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, ఎమ్ఎస్ఎమ్ఈ లతోపాటు అడ్వెంచర్/హెరిటేజ్ వసతుల కల్పనకు చాలా ఉపయుక్తం అవుతుందన్నారు. రామాయణ్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్ వంటి వివిధ పర్యాటక సర్క్యూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపించడం ద్వారా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
మూడురోజుల పాటు జరగనున్న వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులు, కార్యదర్శులు, ఇతర పర్యాటక భాగస్వాముల సదస్సుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 250 మంది వరకు పాల్గొననున్న ఈ సదస్సులో దేశీ పర్యాటకానికి మంచిరోజులు తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణపై నిర్దిష్టంగా చర్చించనున్నారు. హిమాలయ రాష్ట్రాల్లో పర్యాటకం, సుస్థిర పర్యాటకం, పర్యాటక రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ప్రమోషన్, హోం స్టే సదుపాయాలు, భారతీయ ఆతిథ్య రంగం ప్రత్యేకతలు, ఆయుర్వేదం, వెల్‌నెస్, మెడికల్ వ్యాల్యూ ట్రావెల్, దేశీయ పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. జీ-20 దేశాల్లో పర్యాటక సంబంధిత అంశాలపై పరస్పర సహకారం, పర్యాటక శాఖ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష కూడా జరపనున్నారు.
Read Also: Flying Cars: ఎగిరే కార్లు వస్తున్నాయి.. విజయవంతంగా పరీక్షించిన చైనా..