Union Minister Kishan Reddy Letter To Telangana Chief Minister K. Chandrashekar Rao.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు విషయం గురించి లేఖ రాశారు. ఆ లేఖలో.. తెలంగాణ రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సంబంధిత శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 06 అక్టోబర్, 2021 నాడు Do. No. HMCA/2021/2142-F లేఖను మీకు వ్రాయడం జరిగింది. రాష్ట్రంలోని నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధిలో సాధించిన పురోగతి చాలా స్వల్పమనే చెప్పవచ్చు. ఆయా విమానాశ్రయాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు మరియు విమానాశ్రయాలలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు వంటి ప్రాథమిక విషయాలలో ఏ మాత్రం పురోగతి సాధించకపోవడం చాలా విచారకరం.
1. వరంగల్ విమానాశ్రయం
748 ఎకరాలలో విస్తరించి ఉన్న వరంగల్ విమానాశ్రయం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కు సంబంధించినది. ఇది ప్రస్తుతం శితిలావస్థలో ఉంది మరియు అక్కడ ఎటువంటి కార్యకలాపాలను సాగించడానికి వీలు లేకుండా ఉంది.
ఈ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా విమానాశ్రయంలో ఉన్న అడ్డంకులను తొలగించి కావలసిన మరమ్మత్తులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను.
ఈ విమానాశ్రయం యొక్క మొదటి దశ అభివృద్ధి పనులకు 27.7 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 333.86 ఎకరాల భూమిని సమీకరించవలసి ఉంటుంది.
2. అదిలాబాద్ విమానాశ్రయం
వాణిజ్య విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం క్రింది చర్యలను తీసుకోవాలి.
రన్ వే కు సంబంధించిన అప్రోచ్ ఫన్నెల్ నందు మరియు ఆ మార్గంలో ఉన్న 100 కు పైగా అడ్డంకులను తొలగించాలి.
అనుకుంట గ్రామాన్ని, అదిలాబాద్ తో కలిపే రోడ్డును దారి మళ్లించాలి.
మొదటి దశ అభివృద్ధి పనులకు 122 ఎకరాలు, రెండవ దశ అభివృద్ధి పనులకు 175 ఎకరాల భూమిని సమీకరించవలసి ఉంటుంది.
3. జక్రాన్ పల్లి విమానాశ్రయం
ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం.
వాణిజ్య విమానాలు రాకపోకలు సాగించటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం క్రింది చర్యలను తీసుకోవలసి ఉంటుంది.
ఇది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కావడం వలన తొలుత విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది.
విమానాశ్రయం నిర్మించే స్థలంలోని అడ్డంకులను తొలగించి, భారత వాయుసేన(IAF) నుండి అనుమతులు తీసుకోవాలి.
ఈ విమానాశ్రయం మొదటి దశ అభివృద్ధిపనులకు ఇది వరకే చూపించిన స్థలంలో 510 ఎకరాలు మరియు రెండవ దశ అభివృద్ధి పనులకు 235 ఎకరాలను సమీకరించవలసి ఉంటుంది.
సాంకేతిక పరంగా, ఆర్థిక పరంగా పై మూడు విమానాశ్రయాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికలను కూడా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 17 జూన్, 2021 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో పై మూడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయటంలో అవసరమైన సహకారాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇది వరకే తెలియజేసినందున, ఆ సహకారాన్ని అందిపుచ్చుకుని, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పైన తెలిపిన పనులను వీలయినంత త్వరగా పూర్తి చేసినట్లయితే మన రాష్ట్రంలో మరో మూడు విమానాశ్రయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కావున, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయించి, కావలసిన సౌకర్యాలను కల్పించి విమానాశ్రయాలను వీలయినంత త్వరగా సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’ అంటూ కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.