భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తదన్నారు.
దేశంలో జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాలన చేయడంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప ఘనత సాధించిందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 45 సంవత్సరాల తర్వాత బీజేపీకి అవకాశం రావడం అనివార్యమని పేర్కొన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాలనలో ఉన్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని, అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల మంది ప్రజలు బీజేపీకి అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించడం గర్వకారణమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా రానున్న రోజుల్లో అధికారంలోకి రావేది బీజేపీనేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
బీజేపీ సభ్యులందరూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం అహర్నిశలు కష్టపడాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి పదేళ్లలో వచ్చిన ప్రజావ్యతిరేకత కంటే ఎక్కువ వ్యతిరేకతను పది నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుందని విమర్శించారు. మజ్లిస్ పార్టీకి ఊడిగం చేసేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బానిస మనస్తత్వంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలు ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి రాజకీయ కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. అలాంటి కుట్రలను బద్దలుకొట్టి, ప్రజలముందు ఆ పార్టీల నిజస్వరూపాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించేందుకు మజ్లిస్ కల్లోహాలు సృష్టించిందని చెన్నారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారని పేర్కొన్నారు. తీగలగుట్ట వంటి ప్రాంతాల్లో 400 మంది దళితులు, హిందువులు హత్యకు గురయ్యారని, మజ్లిస్ పార్టీ దౌర్జన్యాల వల్ల పాతపట్నం ప్రాంతాల్లో హిందువులు బస్తీలను విడిచిపెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మజ్లిస్ పార్టీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ అవినీతి, అహంకారపూరిత పాలన నుంచి, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, కేసీఆర్ కుటుంబం ఆధిపత్య రాజకీయాల నుంచి తెలంగాణను రక్షించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. బీజేపీ పాలన ఖచ్చితంగా ప్రజాసమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 14 వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త తన ఇంటిపై పార్టీ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. ఏప్రిల్ 14 నుంచి 22 వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించాలని అన్నారు.