Kishan Reddy : ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కళాశాలల యాజమాన్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, నిర్లక్ష్య ధోరణిపట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. 14నెలల మీ పాలనలో ఆయా వర్గాలేవీ సంతృప్తిగా లేరనేది నిస్సందేహమని, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలను సైతం మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వాళ్లకు దక్కాల్సిన న్యాయమైన హక్కులను కూడా కాలరాస్తున్నారని, ఆఖరుకు ఉద్యోగులకు, పెన్షనర్లకు రొటీన్‌గా అందాల్సిన చెల్లింపులను, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను కూడా చెల్లించకుండా జాప్యం చేస్తూ వారిని తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ పెన్షన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పేరుతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడమనేది ప్రభుత్వ పాలనలో రోటీన్‌గా జరిగే వ్యవహారమన్నారు కిషన్ రెడ్డి. కానీ వాటిని కూడా మీరు చెల్లించకపోవడంవల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.8,200 కోట్లు బకాయి పడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల మీరు అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రభుత్వాన్ని నమ్ముకుని నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, వారికి మీరు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారో ఒక్కసారి ఆలోచించండన్నారు కిషన్ రెడ్డి.
MLC Elections 2025: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
అంతేకాకుండా..’ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే గత ఏడాది (2024) 8 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఈ ఏడాది మరో 10వేల మంది రిటైర్ కాబోతున్నరు. వారికి పదవీవిరమణకు సంబంధించిన ప్రయోజనాలను రూ.11 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. నేటి వరకు ఒక్కరికి కూడా చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసం? జీతం పైసల నుండి సొంతంగా జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిత్యం మంత్రుల పేషీల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులకు మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో మీరు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత విధానంతో తీరుతో లక్షలాది విద్యార్థులు, వందలాది మంది కళాశాలల యాజమాన్యాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఇంటర్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ వంటి కోర్సులను చదువుతున్న దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ గత బీఆర్ఎస్ పాలకులు గానీ, ప్రస్తుతమున్న మీ ప్రభుత్వం కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంవల్ల దాదాపు రూ.7,500 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి.
బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా కాలేజీల నిర్వహణ భారమై రాష్ట్రవ్యాప్తంగా వందలాది కాలేజీలు మూసివేతకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కాలేజీలు మూతపడ్డాయి. 90% కాలేజీ యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వలేని కారణంగా కాలేజీల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పులు పెరగడంతో ఆయా కాలేజీల నిర్వహణ కూడా భారంగా మారింది. సరైన వేతనాలు చెల్లించలేకపోవడంతో.. విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇది రాష్ట్ర విద్యావ్యవస్థకే పెనుసవాల్ గా మారే పరిస్థితులను సృష్టిస్తోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సంవత్సరాల తరబడి చెల్లించకపోవడంతో తమ కాలేజీలు నడవాలంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని విద్యార్థులే మోయాలని, లేనిపక్షంలో సర్టిఫికెట్లు ఇవ్వబోమని యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంవల్ల సామాన్య, బడుగు బలహీనవర్గాల విద్యార్థులు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లుల్లో సుమారు రూ.380 కోట్ల మేరకు చెల్లిస్తామని గత ఏడాది నవంబరులో టోకెన్లను జారీ చేసినా.. ఇంతవరకు ఎటువంటి చెల్లింపులు జరపకుండా కాలేజీ యాజమాన్యాలను పాలకపార్టీ నాయకులు చుట్టూ తిప్పుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను క్లియర్ చేస్తామని మీరు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మీరు మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసింది. మీ సభలకు పెద్దమొత్తంలో తరలిరావాలని, కళాశాలలు మూసేసి.. సిబ్బందిని తీసుకురావాలని, లేకుంటే ఇబ్బంది పడతారని ఆయా జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మీ ప్రభుత్వ అసమర్థత కారణంగా ఇప్పటికే తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్న కాలేజీ యాజమాన్యాలు.. ఇప్పుడు మీ కార్యక్రమం కోసం బెదిరింపులు ఎదుర్కొంటుండటం దురదృష్టకరం.
ఇది కాకుండా.. ఏప్రిల్, మే నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని మీరు కాలేజీ యాజమన్యాలను మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ గట్టెక్కడానికే.. మీరు ఇలాంటి చర్యలకు పూనుకోవడం ముఖ్యమంత్రి పదవికి ఏ మాత్రం శోభను ఇవ్వదని గుర్తుంచుకోవాలి. మీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా యుద్ద ప్రాతిపదికన తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలి. అదే విధంగా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, PRC బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.’ అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
AP Assembly Budget Session: మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..