Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు గ్వాలియర్ నుంచి బయలుదేరి సిథౌలీ స్టేషన్‌కు చేరుకుంటున్న కొద్ది నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుండి పొగలు వచ్చినప్పటికీ, అసలు మంటలు లేవని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఝాన్సీ పబ్లిక్ రిలేషన్స్ అధికారి స్పష్టం చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు
“రైలు నెంబరు 19666 ఉదయపూర్ – ఖజురహో ఎక్స్‌ప్రెస్‌లోని ఇంజిన్‌లో పొగలు కనిపించాయి. వెంటనే రైలును ఆపి ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్-కాంటిలివర్ మూసివేశారని, ఈ నేపథ్యంలో పొగ నియంత్రించబడింది. మరో ఇంజన్‌ను అమర్చడం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తాం. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నాం.” అని ఎన్‌సీఆర్‌లోని హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. మంటలు చెలరేగడంతో రైలు రెండు గంటలకు పైగా నిలిచిపోయిందని పలువురు ప్రయాణికులు తెలిపారు.
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉద్యాన ఎక్స్‌ప్రెస్ రైలులో అంతకుముందు రోజు కూడా ఇదే తరహాలో మంటలు చెలరేగాయి. రైలు బోగీల్లోంచి పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. “సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఉద్యాన ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు రైలు దిగిన 2 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదు. అగ్నిమాపక యంత్రాలు, నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ” అని ఓ రైల్వే అధికారి వెల్లడించారు.