కర్ణాటక ప్రభుత్వ (Karnataka Goverment) పెద్దలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాంబు బెదిరింపులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కర్ణాటక ముఖ్యమంత్రి, పలువురు ఎమ్మెల్యేలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar), రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర సహా పలువురి ప్రముఖులకు ప్రత్యేకంగా బెదిరింపులు వచ్చాయి.
ప్రభుత్వ ఆదేశాలతో బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Shahidkhan10786@protonmail.com అనే ఈ-మెయిల్ చిరునామా నుంచి బాంబు బెదిరింపులొచ్చాయి. కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతామని మెయిల్‌లో ఉంది.
త్వరలో మరో ట్రైలర్ చూపించాలనుకుంటున్నామని.. అంబారీ ఉత్సవ్ బస్సులో తదుపరి దానిని పేల్చబోతున్నట్లు పేర్కొన్నారు. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు తర్వాత.. మా డిమాండ్లను సోషల్ మీడియాలో లేవనెత్తామన్నారు. అలాగే తదుపరి పేలుడు గురించి కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తామని మెయిల్ పేర్కొన్నారు.
రామేశ్వరం పేలుడు ఘటన మరువక ముందే ప్రభుత్వ పెద్దలకు బాంబు బెదిరింపుల రావడాన్ని సిద్ధరామయ్య సర్కార్ తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశించింది.