నకిలీ నోట్లు ముద్రించారు. వాటి చలామణి కోసం ఏకంగా ఫేక్ కరెన్సీ పేరుతో ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ..జనాలను పోగు చేశారు. నకిలీ నోట్లు ముద్రిస్తూ కొరియర్‌లో పంపుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నారు. బీహార్‌లో ఓ మారుమూల గ్రామాన్ని నకిలీ నోట్ల తయారీకి కేంద్రంగా చేసుకుని.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఠాను నిర్వహిస్తున్నాడు. కామారెడ్డిలో రెండు దొంగనోట్ల బయటపడటంతో.. తీగ లాగితే దొంగ నోట్ల రాకెట్ బయటపడింది.
Also Read:Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’
కామారెడ్డిలో రెండు 500 రూపాయల దొంగ నోట్లు బయటపడ్డాయి. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ వైన్స్ షాపులో అక్టోబర్ 23న కామారెడ్డి మండలం షాబ్దీపూర్‌కు చెందిన సిద్దాగౌడ్ మరొకరితో కలిసి రెండు 500 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశారు. క్యాషియర్ అఖిల్‌కు.. సిద్దాగౌడ్ ఇచ్చిన నోట్లు .. నకిలీవనే అనుమానం వచ్చింది. సిద్దాగౌడ్ ఇంటికి వెళ్లి నోట్లపై ప్రశ్నించాడు. అవి తన జీతం డబ్బులుగా బుకాయించాడు. సిద్దాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీ అని నిర్దారించుకున్న అఖిల్… కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు నోట్ల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. కామారెడ్డిలో తీగలాగితే.. బీహార్‌లో దొంగనోట్ల ముఠా డొంక కదిలింది.
అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కొల్‌కతా, మహారాష్ట్రకు చెందిన 12 మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడగా కామారెడ్డి పోలీసులు రెండు దొంగ నోట్ల ఫిర్యాదుపై తీగలాగి.. నకిలీనోట్ల తయారీ, చలామణి చేసే ముఠాను పట్టుకున్నారు. బీహార్‌లోని ఓ మారుమూల గ్రామంలో నకిలీ నోట్లను తయారు చేసి వాటిని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తుండగా.. 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు చెందిన ఇబ్నుల్ రషీద్‌తోపాటు 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ఇబ్నుల్ రషీద్‌ను బీహార్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా గుర్తించారు. రషీద్ రంగులు రసాయనాల మిశ్రమంపై అవగాహన ఉంది. దీంతో అతడు నకిలీ నోట్ల తయారు చేసి డబ్బులను సంపాదించుకోవాలని గాడి తప్పాడు. ఫేస్ బుక్‌లో ఫేక్ కరెన్సీ పేరుతో ఓ పేజీని క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా.. బీహార్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కొల్‌కతా, మహారాష్ట్రకు చెందిన నందులాల్ జంగ్, చట్టరామ్, సౌరవ్ డే, హరినారాయణ భగత, పండిత్, లఖన్ కుమార్ దుబే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్ , శివశర్మను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారంతా.. బీహార్ రోహ్తాస్ జిల్లాలోని ఇబ్నుల్ రషీద్ ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేశారు. వాటిని ఇతర రాష్ట్రాల్లో చలామణి చేసినట్లు పోలీసలు గుర్తించారు.
ఫేస్ బుక్‌లో ఫేక్ కరెన్సీ గ్రూపులో చేరిన కామారెడ్డి యువకుడు.. అందులో సౌరవ్ డేను పరిచయం చేసుకుని.. 5వేల అసలు నోట్లు చెల్లించి.. 10వేల దొంగ నోట్లను కొరియర్ ద్వారా తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫేస్ బుక్ ఫేక్ కరెన్సీ పేజీలో ఆర్డర్లు తీసుకుని.. కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన కస్టమర్లకు 25 లక్షల వరకు నకిలీ నోట్లు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 23 మంది దొంగ నోట్ల కోసం ఆన్ లైన్‌లో ఆర్డర్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి 3 కోట్ల నకిలీ నోట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రధాన నిందితుడు రషీద్ ఇంటి నుంచి 3.08 లక్షల నకిలీ నోట్లు 15,300 అసలు నోట్లు… 8,830 సగం ముద్రించిన నోట్లు, ప్రింటర్లు, కంప్యూటర్ కలర్లు, పేపర్లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు ఇబ్నుల్ రషీద్‌తో పాటు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు.
Also Read:Shocking : కూలీకి వెళ్లే మహిళలే టార్గెట్.. పని పేరుతో నమ్మించి కిరాతకంగా..
ఎండ్- రెండు నకిలీ నోట్లతో.. అంతరాష్ట్ర నకిలీ నోట్ల తయారీ చలామణి చేసే ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 మంది నిందితుల్లో 8 మంది పట్టుబడగా.. మరో నలుగురిని త్వరలో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కామారెడ్డి పోలీసులు. ఐతే ఫేక్ నోట్లతో అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.