Shocking : మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన మహిళ హత్యాచారం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జిల్లా పోలీసులు నిందితుడిని ఫకీర్ నాయక్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫకీర్ నాయక్ ఈ నెల 10న కోర్టుకు హాజరుకావడానికి వచ్చిన ఒక మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఫకీర్ ముఖ్యంగా కూలికి వెళ్లే మహిళలని టార్గెట్ చేసుకుంటూ, పని పేరుతో నమ్మించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి బెదిరించి అత్యాచారం చేసి, ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లేవాడని పోలీసులు పేర్కొన్నారు.
పరిశీలనలో, ఫకీర్ నాయక్ పై ఇప్పటివరకు 7 కేసులు నమోదు కాగా, వీటిలో రెండు హత్యలు ఇదే విధంగా జరిగినట్లు గుర్తించారు. నిందితుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా అయితే, గత కొన్నేళ్లుగా సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడని పోలీసులు వివరించారు. మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.