Veera Shiva Reddy Joined in TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్ది కొందరు రాజకీయ నేతలు.. పక్క పార్టీలకు వెళ్తుండగా.. మరికొందరు నేతలు.. తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు.. అలా ప్రతీరోజూ ఎవరో ఒకరు వివిధ పార్టీల్లో చేరుతూనే ఉన్నారు.. ఇక, ఈ మధ్య వరుసగా టీడీపీలో పలువురు నేతలు చేరుతూ వస్తు్నారు.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. కమలాపురం నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించారు వీర శివారెడ్డి. ఇక, ఆయనతో పాటు ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి.. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాస్ తదిరతులు ఈ రోజు టీడీపీ కండువా కప్పుకున్నారు.
Read Also: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై ఐసీజే తీర్పు..రక్షించుకునే హక్కుందన్న నెతన్యాహు..
కాగా, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన వీరశివారెడ్డి.. తొలినాళ్లలో టీడీపీలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా కమలాపురం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. 2004లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు.. అయితే, 2009 ఎన్నికల నాటికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలపొందారు. తర్వాత, ఏపీ పునర్విభజన, తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది.. ఇక, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.. కానీ, తగినంత ప్రాధాన్యత దక్కడం లేదంటూ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. ఇప్పుడు మళ్లీ సైకిల్ ఎక్కారు..