Kaleshwaram Commission Report: ఒకట్రెండు రోజుల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వంకు ఇవ్వనుంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచారు. దాదాపు 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3 వేల పేజీలతో మొత్తం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటి లేదా రెండో తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి.. ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న లోపాలు, వాటి ఆధారాలతో భారీ నివేదికను సిద్ధం చేశారు. కమిషన్‌కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.
నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారులు చెప్పిన అంశాలపై ప్రత్యేక ప్రస్తావన చేసింది. ఐఏఎస్, ఇంజనీర్లకు సమన్వయ లోపం ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలు నేరుగా క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు చేయడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా పోయింది. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్ల మార్పు చేసినట్లు గుర్తించారు. డీపీఆర్ మార్పులు, మొదట్లో చెప్పిన డీపీఆర్, తర్వాత డీపీఆర్లో మార్పులు, నిధుల సేకరణ ఎలా జరిగిందో వివరించే అవకాశం ఉంది. హైలెవల్ కమిటీ అనుమతి లేకుండానే బడ్జెట్ రిలీజ్ గుర్తించింది. మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేరువేరుగా పోందుపర్చింది. అధికారుల తప్పిందం అంశాలపై లీగల్ అంశాలతో సిఫార్సు చేసింది. బహిరంగ విచారణ సందర్భంగా సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అంశాలను చేర్చింది.
గతేడాది జూన్ నుంచి జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రత్యక్ష విచారణ చేపట్టింది. వందల అఫిడవిట్లు, బహిరంగ విచారణలు, ఎన్డీఎస్‌ఏ, కాగ్ నివేదికలు, విజిలెన్స్, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గత ప్రభుత్వం ఆమోదించిన మంత్రి మండలి మినిట్స్, ప్రభుత్వం సమర్పించిన వేల పేజీల సమాచారాన్ని కమిషన్ పూర్తిగా పరిశీలించింది. అన్నింటి నుంచి కీలక ఆధారాలను కమిషన్ సేకరించింది. మూడు బ్యారేజీల్లో చోటుచేసుకున్న లోపాలు, వాటికి సంబంధించిన ఆధారాలతో నివేదికను సిద్ధం చేసిందని తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లు కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.