వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కాకాణిని జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక బలగాల మధ్య వెంకటగిరికి కోర్టుకు తీసుకొచ్చి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం బెంగళూరులో కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ కేసులో నాలుగో నిందితుడి (ఏ4)గా ఆయన ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. పోలీసులు పలుమార్లు నోటీసులిచ్చినా కాకాణి బేఖాతరు చేశారు. అరెస్టు తప్పదని గ్రహించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసినా నిరాశ తప్పలేదు.
Also Read: Vallabhaneni Vamsi: గుంటూరు జీజీహెచ్‌లో వంశీకి చికిత్స.. పోలీసులతో పంకజశ్రీ వాగ్వాదం!
గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలుచోట్ల తలదాచుకున్నారు. చివరకు బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు.