బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది? అని కడియం ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా హనుమకొండలోని హరిత హోటల్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు తనకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. ‘స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడంతోనే మనకు ఇన్ని నిధులు వచ్చాయి. నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంది అంటే.. మొత్తంలో నిధులు తేవడమే కారణం. నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండాయి. కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు అందిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ప్రగతికి సీఎం అన్ని విధాలుగా అండగా ఉన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెచ్చిన నిధులపైన నేను కట్టుబడి ఉన్నా’ అని కడియం తెలిపారు.
Also Read: Ponguleti Biopic: ‘శ్రీనన్న అందరివాడు’.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
‘స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలతోనే ఉంటా, ప్రజల కోసమే నిరంతరం కష్టపడతా. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్‌లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదు. మీరు చేర్చుకున్నపుడు ఒక విధానం, వేరే వారు చేర్చుకున్నప్పు ఇంకో విధానంను బీఆర్ఎస్ పాటిస్తుంది. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇప్పుడు విలువలు గుర్తుకొచ్చాయా?. స్పీకర్‌కి కోర్టు సూచన చేసింది కానీ.. ఆదేశాలు జారీ చేయలేదు. స్పీకర్‌కి నేను సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఉంది. ఒక్కొక్కరి కొంత సమయం ఇచ్చారు, తప్పకుండా స్పీకర్‌కి సమాధానం ఇస్తాను. నేను పార్టీ మారి పదవి అనుభవించలేదు, నా పని తిరుతోనే పదవి వచ్చింది’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు.