తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ రానుంది. ‘శ్రీనన్న అందరివాడు’ పేరుతో పొంగులేటి బయోపిక్ తెరకెక్కనుంది. సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ అండ్ నిర్మాతగా బయ్యా వెంకట నర్సింహ రాజ్ వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Also Read: Revanth Reddy: మా కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్ ‘శ్రీనన్న అందరివాడు’ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటుగా అస్సామీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ శ్రీ వెంకట్ కాగా.. పాటలు కాసర్ల శ్యామ్ పాటలు రాయనున్నారు. శ్రీనన్న అందరివాడు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్టర్‌లో ఓ వైపు హీరో సుమన్.. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనువిందు చేస్తున్నారు.
2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఆ వేంటనే అప్పటి టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)లోకి మారారు. 2018 సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజుకు మద్దతు ఇచ్చారు. 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పొంగులేటి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. జూలై 2023లో ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ‘తెలంగాణ జన గర్జన’ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.