బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. గుత్తా జ్వాల మంగళవారం (ఏప్రిల్ 22) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. నాలుగో పెళ్లి రోజు నాడు తమకు ఆడపిల్ల పుట్టినట్లు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులకు ఫాన్స్ సహా ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. విష్ణుకు ఇప్పటికే ఆర్యన్ అనే కుమారుడు ఉన్నాడు.
విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ శుభవార్త తెలిపారు. ‘మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈరోజు మా నాలుగో పెళ్లి రోజు. ఈ రోజున పాప పుట్టడం మరింత ఆనందంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’ అని విష్ణు విశాల్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఓ క్యూట్ ఫొటోను పంచుకున్నారు. కృతి ఖర్బందా, పూజా రామచంద్రన్, పృథి నారాయణన్ విషెస్ చెప్పారు.
Also Read: Ajinkya Rahane: మేము గెలవాల్సిన మ్యాచ్.. ఓపెనింగ్ సరిగా లేదు!
కొంతకాలం ప్రేమలో ఉన్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్ 2021 ఏప్రిల్ 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విష్ణు విశాల్ గతంలో రజనీ నటరాజ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆర్యన్ 2017లో జన్మించాడు. 2018లో ఈ జంట విడిపోయింది. 2021లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాను విష్ణు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘ఇరండు వానం’లో విష్ణు నటిస్తున్నారు. మరోవైపు గుత్తా జ్వాలా గతంలో తన సహచర ఆటగాడు చేతన్ ఆనంద్ (2005–2011)ను పెళ్లి చేసుకున్నారు.