తమ బౌలింగ్ విభాగం బాగుందని, ఓపెనింగ్ సరిగా లేదని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. సరైన ఓపెనింగ్ లేక టోర్నమెంటంతా ఇబ్బంది పడుతున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదఐ పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ బాగా చేయలేదని, మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నామని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా అయిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ‘199 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తాం అనుకున్నాం. భారీ ఛేదనలో ఓపెనింగ్ ఆరంభం బాగుండాలి. మా జట్టు ఓపెనింగ్ సరిగా లేదు. ఈ టోర్నమెంటంతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాము. నిజానికి మా బౌలింగ్ విభాగం బాగుంది. బ్యాటింగ్‌లోనే మేము తడబడ్డాము. మేం మా తప్పుల నుంచి తొందరగా నేర్చుకోవాల్సి ఉంది. ఈ పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది. ప్రత్యర్థి జట్టును 200 లేదా 210లోపు కట్టడి చేయాలనుకున్నాం. మాకు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. గుజరాత్‌ను కట్టడి చేయడంలో సఫలం అయ్యాము’ అని జింక్స్ చెప్పాడు.
Also Read: Gold Rate Today: లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటిన బంగారం ధర
‘మేం మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తేలిపోయాం. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా నమోదు చేయలేకపోతున్నాం. బ్యాటింగ్ యూనిట్‌గా మేము మెరుగుపడాలి. మా బౌలర్ల గురించి నాకు ఎలాంటి ఆనందోళన లేదు. ప్రతి మ్యాచ్‌కూ రాటుదేలుతున్నారు. ఫీల్డింగ్‌లో మరింత మెరుగ్గా ఉంటే 15 నుంచి 20 పరుగులు ఆపి ఉండేవాళ్లం. ఫీల్డింగ్‌పై మా ప్లేయర్స్ బాగానే దృష్టి పెడుతున్నారు. టీ20 ఫార్మాట్లో ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మా బ్యాటర్లు పరుగులు చేయడంపై ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మాకు మిడిల్ ఆర్డర్‌లో నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. నేను వారిని అండగా ఉంటా. అంగ్‌క్రిష్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు’ అని రహానే చెప్ప్పుకొచ్చాడు.