Justice Chelameswar: రాజ్యాంగం వల్ల ఓటు ద్వారా ఎన్నికై చట్ట సభల్లో అడుగు పెడుతున్నారని.. దురదృష్టవశాత్తు యాభై సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో చట్టం ద్వారా ఓటు ప్రక్రియ వచ్చినట్లు తీర్పులు వచ్చాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయకపోవడం వల్ల ఈ వ్యాఖ్యానాలు వచ్చాయన్నారు. విజయవాడలో ఓట్ ఫర్ డెమోక్రసీపై రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగంలో ఐదేళ్లకు ఎన్నికలు జరగాలని ఉంది, వ్యవస్థను పెట్టారన్నారు. ఓటుకు సంబంధించిన హక్కు కేవలం చట్టం ద్వారా వచ్చిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఓటు వేయడానికి కచ్చితంగా రాజ్యాంగపరమైన హక్కు ఉందన్నారు. 326 ఆర్టికల్ నియమాలకు లోబడి ఓటు వేసే హక్కు ఉంటుందన్నారు.
Read Also: Chandrababu: ఆట మొదలైంది.. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు..
ఓటు హక్కును ప్రజలు ఎలా వినియోగించుకుంటున్నారు.. అనేది మన దేశంలో సమస్య అని వెల్లడించారు. నేడు అన్ని పార్టీలు అధికారం కోసం అనాలోచితంగా హామీలు ఇస్తున్నారన్నారు. ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావన్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని.. మనం సరిదిద్దుకోకపోతే మనకు మంచి భవిష్యత్తు ఉండదన్నారు. ఎక్కడో నిరక్షరాస్యులు ఉన్న చోటే కాదు… పట్టభద్రులు కూడా నాకేంటి అంటున్నారన్నారు. వ్యక్తిగత స్వలాభం… వ్యవస్థలకు చేటు తెస్తుందన్నారు. ఇప్పుడు బాగున్నా…. పిల్లలు భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు. తనకు పోటీచేసే ఆలోచన లేదని.. ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నామన్నారు. న్యాయ వ్యవస్థతో సహా అన్ని అన్ని వ్యవస్థలు సొంతంగా ఆలోచన చేయాలి, పని చేయాలని ఆయన పేర్కొన్నారు.
Read Also: CM Jagan Election Campaign: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
న్యాయం, ప్రజా స్వామ్యాన్ని పరి రక్షించుకోవాలని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. లేదంటే ఆ దుష్ఫలితాలను తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం తరువాత ప్రజల మంచి కోసం రాజ్యాంగం రాశారన్నారు. మారుతున్న సమాజంతో కొన్ని మార్పులు అనివార్యమన్నారు. కానీ మూల విధానాలు, నిబంధనలు అలాగే ఉంటాయన్నారు. రాజ్యాంగాన్ని జలియన్ వాలా బాగ్ అమరవీరుల రక్తంతో రాసిందిగా భావిస్తే విలువ ఇస్తారన్నారు. తన అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ప్రెస్ మీట్ పెడితే తనను తెగ ట్రోల్ చేశారని ఆయన మండిపడ్డారు. విమర్శలు తీసుకున్నోళ్లే ప్రజాస్వామ్య వాది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గురించి నలుగురికి చెప్పాలంటే మనం ఆచరించాలన్నారు. మహాత్మాగాంధీ చెప్పిందే చేశారు, చేసేదే చెప్పారన్నారు. కానీ ఆయన్ను కూడా ఇటీవల తెగ ట్రోల్ చేసే పరిస్థితి చూస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం రక్షణలో ప్రజలే కీలక సూత్రధారులని జస్టిస్ చలమేశ్వర్ వెల్లడించారు. వారిలో మంచి మార్పు వస్తే… వ్యవస్థల్లో కూడా మార్పు చూస్తామన్నారు.