కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ (Justice Abhijit) రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెంగాల్‌లోని తమ్లుక్ నియోజకవర్గం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha polls) పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మంగళవారం అభిజిత్ గంగోపాధ్యాయ మాట్లాడుతూ జడ్జి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించినట్లు పేర్కొన్నారు. బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తాను చాలా కష్టపడి పని చేసే వ్యక్తినని.. ప్రధాని మోడీనే ప్రశంసించారని గుర్తుచేశారు. మార్చి 7న కమలం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
2018 మే నెలలో కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా అభిజిత్ గంగోపాధ్యాయ బాధ్యతలు చేపట్టారు. 2020లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది చివరిలో పదవీ విరమణ ఉన్నప్పుటికీ ముందుగానే రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.