ఆ జిల్లాలో టీడీపీ సీనియర్స్ అయోమయంలో ఉన్నారా? మింగలేక, కక్కలేక సతమతం అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్లో కొంతమంది పక్క చూపులు కూడా చూస్తున్నారన్నది నిజమేనా? అసలేంటి వాళ్ళకొచ్చిన సమస్య? అధికార పార్టీలో ఉండి కూడా మారిపోవాలనే ఆలోచన వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు ఏమున్నాయి? అసలు ఏ జిల్లాలో ఉందా వాతావరణం?.
పార్వతీపురం మన్యం జిల్లాలో పసుపు యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ సీనియర్ నేతలుగా గుర్తింపు ఉన్న ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు, భంజ్‌దేవ్‌ను పక్కనపెట్టి జూనియర్ లీడర్స్ పెత్తనం చెలాయిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీ వర్గాల్లో. దాంతో పెద్దోళ్ళ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిందట. బోనెల విజయచందర్, తోయక జగదీశ్వరి, సంధ్యారాణి వంటి నేతలు జిల్లాలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ కార్యక్రమాలు, పదవుల కేటాయింపుల్లో సీనియర్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమం ఏది జరిగినా సీనియర్ నేతలను పిలవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
దీంతో చేసేదేమీ లేక ఇంటిపట్టునే కాలం వెళ్లదీస్తున్నారన్నట్టు చెప్పుకుంటున్నారు. తమను పక్కపెట్టినట్టు స్పష్టంగా అర్ధం అవుతున్నా… ఆవిషయాన్ని బయటికి చెప్పుకోలేక, బహిరంగంగా మాట్లాడితే పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనన్న ఉద్దేశ్యంతో పెద్దలంతా సంయమనం పాటిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు అయి ఉండి బహిరంగంగా వ్యతిరేకిస్తే…..పార్టీని, అధిష్టానాన్ని ఇరుకున పెట్టిన వాళ్లం అవుతామన్న అభిప్రాయం ఒకవైపు, ఇప్పటికీ నోరు తెరవకుంటే మొత్తానికే కనుమరుగు అయిపోతాం, రాబోయే రోజుల్లో దక్కాల్సిన పదవులకు దూరమవుతాయన్న భయం మరోవైపు ఉండి.. రెండింటి మధ్య నలిగిపోతున్నారన్న చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.
అధినేత పిలుపుతో గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పని చేశామని, తీరా అధికారం వచ్చాక గుర్తింపు లేకుండా పోయిందన్నది వాళ్ళ బాధ. ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదన్నది పెద్ద నాయకుల బాధ. పార్టీలో కష్టపడిన వారికి గౌరవం, గుర్తింపు ఒకప్పుడు ఉండేదని, ఇప్పుడు మాత్రం అవకాశవాద రాజకీయాలే పైచేయి సాధిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట మన్యం జిల్లా టిడిపి సీనియర్స్. ఈ వర్గపోరుతో పార్టీలో కొనసాగలేమని, జెండా ఎత్తేస్తే ఎలా ఉంటుందని కొందరు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పార్వతీపురం మున్సిపాలిటీలోని పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఈ అంతర్గత విభేదాలు పార్టీని ఘోరంగా దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తం మీద పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్గ రాజకీయాలు జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.