OTR: పంచాయతీ ఎన్నికల ఫలితాలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని తీరుకు ముడి పడుతోందా? రిజల్ట్ సరిగా లేని చోట జిల్లా మంత్రుల మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నారా? రేపు కేబినెట్ మార్పు చేర్పులకు, దీనికి లింక్ ఉండబోతోందా? కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో?
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీన్‌మార్ కొట్టింది. అధికార పార్టీగా తన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో నిరూపించుకుంది. మొత్తం 12వేల 719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 7వేల పైచిలుకు గెలుచుకొని గ్రామీణ తెలంగాణ మద్దతు ప్రభుత్వానికే ఉందని నిరూపించుకోగలిగింది. అదంతా ఒక ఎత్తయితే…. అసలు గెలవాల్సిన కొన్ని చోట్ల ఓడిపోవడం, రెబెల్స్ రూపంలో సొంత వాళ్ళనే ఓడించడం లాంటి వ్యవహారాల మీద ఇప్పుడు దృష్టి పెట్టారట పార్టీ పెద్దలు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పట్ల వ్యతిరేకత ఉండటం, వాళ్ళే గ్రూప్‌వార్‌ను కట్టడి చేయలేకపోగా ప్రోత్సహించడం, పర్యవేక్షించాల్సిన జిల్లా మంత్రులు పట్టింపులేనట్టుగా ఉండడం లాంటి చాలా అంశాలు మెల్లిగా తెర మీదికి వస్తున్నాయట. పాలమూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే సొంత ఊళ్ళో తన సోదరుడిని గెలిపించుకోలేకపోయారు. ఇలా కొన్నిచోట్ల విభిన్నమైన తీర్పు ఇచ్చారు ప్రజలు.
ఇప్పుడిదే పార్టీ పెద్దల్ని ఆలోచనలో పడేస్తోందట. పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ రెడ్డి మొదట్నుంచీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన క్షేత్ర స్థాయి నాయకులను సర్పంచులుగా గెలిపించాల్సిన బాధ్యత మనపైనే ఉందంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. కాస్త అటు ఇటుగా ఉందన్న సమాచారం వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యేల్ని హెచ్చరిస్తూ వచ్చారు. తీరా చూస్తే… కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కారణంగానే గెలవాల్సిన కొన్ని పంచాయతీలను ప్రత్యర్థులకు సమర్పించుకోవాల్సి వచ్చిందట. మెజార్టీ సీట్లు గెలిచాం, సత్తా చాటామన్న ఆనందం ఓవైపు ఉన్నా… కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగిందన్న అభిప్రాయం మాత్రం పార్టీ పెద్దల్లో బలంగా ఉంది. జిల్లాల్లో సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల రెబెల్స్ బెడద పెరిగిపోయింది. కాంగ్రెస్ సొంతంగా గెలిచే సర్పంచుల సంఖ్య తగ్గడానికి ఇలాంటి ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు. ఇక త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్‌లో కూడా ఇదే తీరు ఉంటే ఎలాగన్న అనుమానం పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. ఒకరకంగా సర్పంచ్ ఎన్నికలు పార్టీని అలర్ట్ చేసినట్టయిందన్న అభిప్రాయం బలపడుతోంది.
రాబోయే ఎన్నికలన్నీ పార్టీ సింబల్ మీద జరిగేవే. దీంతో… పంచాయతీ ఎన్నికల్లో పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల విషయంలో కాస్త కఠినంగానే ఉండాలని అటు పార్టీ ఇటు ప్రభుత్వం భావిస్తున్నాయట. మొదటి రెండు విడతల ఫలితాలను ఇటీవల పార్టీ సమీక్షించింది. ప్రభుత్వ పనితీరుకు 64 శాతం ప్రజల మద్దతు ఉన్నప్పటికీ… మిగిలిన అవకాశాన్ని కూడా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు వల్ల కోల్పోవాల్సి వచ్చిందన్న సంగతి ఆ సమీక్షలో తేలిందట. అందుకే రాబోయే ఎన్నికల విషయంలో కఠినంగానే ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికల ఫలితాలకు ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యులంటూ మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మెజార్టీ సీట్లు గెలుచుకున్నందుకు కొంత హ్యాపీగానే ఉన్నా.. పనితీరును మెరుగుపరుచుకునేందుకు దిశా నిర్దేశం చేసే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలను బట్టి మంత్రుల శాఖల మార్పులు, క్యాబినెట్‌లో చేర్పుల్లాంటివి ఉంటాయా? లేక త్వరలో జరిగే… ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ప్రామాణికంగా ఉండబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను తూకం వేసి లెక్కగట్టబోతున్నారన్నది మాత్రం వాస్తవం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొందరు.