ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు మనం మనం బరంపురం అని పైకి అంటున్నా… లోపల మాత్రం కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? ముందొచ్చిన చెవులకంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ కామ్ అయిపోతున్నారా? ఎవరా లీడర్? సొంత పార్టీలోనికి కొందరు ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పెద్ద పదవులు దక్కించుకోగలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నారైగా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, వస్తూనే టీడీపీ గుంటూరు ఎంపీ టిక్కెట్ దక్కించుకుని గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి సాధించారాయన. అదంతా ఒక ఎత్తయితే… ఢిల్లీ స్థాయిలో పరపతి సాధించిన పెమ్మసానికి సొంత గల్లీలో సరైన సహకారం లభించడం లేదన్నది లేటెస్ట్ టాక్. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒకరకంగా ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారాయన. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… గుంటూరు టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలను వదిలేసి ఏ పని కావాలన్నా పెమ్మసాని దగ్గరకు వెళ్తున్నారన్నది సైకిల్ సౌండ్. ఇక గుంటూరు నగరానికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలైతే… దాదాపు అన్నీ పెమ్మసాని కనుసన్ననల్లోనే జరుగుతున్నాయి. గెలిచిన మొదట్లో ప్రతి శని, ఆదివారాలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించడం, జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం లాంటివి చేసేవారు కేంద్ర మంత్రి. గుంటూరు ప్రభుత్వాసుపత్రి, మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని శాఖల అధికారులతో మాట్లాడుతూ పనులు చక్కబెట్టేవారాయన. ఈ దూకుడుతో.. ఒక రకంగా ఎమ్మెల్యేలు డమ్మీలైపోయారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ ఊపులోనే… గుంటూరులో ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రధాన కారణమవుతున్న శంకర్ విలాస్ ఆర్వోబీ స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి పెట్టారు ఎంపీ.
అంతేకాదు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనులు మొదల్యయాయి, పాత బ్రిడ్జిని కూల్చేశారు. విస్తరణ పనుల్లో స్థలాలు కోల్పోయేవారు కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. సరిగ్గా ఇక్కడే మేటర్‌లోకి వైసీపీ ఎంటరైపోయింది. పనులు నత్త నడకన నడుస్తున్నాయని, కొత్తదాని సంగతి తర్వాత… ముందు ఉన్న వంతెనను కూల్చేసి ట్రాఫిక్ ఇబ్బందులతో జనానికి నరకం చూపిస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. అక్కడితో ఆగితే అది వేరే సంగతి. అసలీ ఇబ్బందులన్నిటికీ కేంద్రమంత్రి పెమ్మసానే కారణమంటూ ధ్వజమెత్తారు ప్రతిపక్ష నాయకులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే… ఏకంగా పెమ్మసాని మీద పర్సనల్ అటాక్ చేశారు. ఆయన గుంటూరుకు పట్టిన శని అని, అహంకారం పెరిగిపోయి, తాను చెప్పిందే చెయ్యాలన్నట్లు ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా… పర్సనల్‌గా చేసిన శని కామెంట్స్ కలకలం రేపాయి. అదే సమయంలో అంబటి కామెంట్స్‌పై స్పందించేందుకు నిరాకరించారు పెమ్మసాని. జిల్లాలోని ఇతర టీడీపీ నాయకుల నుంచి కూడా కనీస స్పందన లేకపోవడమే చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మంత్రి మీద అంబటి ఆ స్థాయిలో విరుచుకుపడితే… కనీసం ఒక్కరంటే ఒక్క ముఖ్య నాయకుడు కూడా రియాక్ట్ అవకపోవడం ఏంటని టీడీపీ కేడరే ఆశ్చర్యపోతోందట.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో ప్రెస్ మీట్ పెట్టి అంబటి ఆరోపణలపై మాట్లాడారు. అప్పుడు కూడా… అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడారే తప్ప సొంతపార్టీ ఎంపీని విమర్శిస్తే తనంతట తానుగా రియాక్ట్ అవలేదు. ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అయితే ప్రెస్ నోట్ తోపాటు ఓ వీడియో రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. తాడికొండ, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రిని అంబటి రాంబాబు వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన ఎమ్మెల్యేలు, నేతలు మొక్కుబడి రియాక్షన్స్‌తో సరిపెట్టడం పార్టీలో చర్చనీయాంశం అయింది. ఎందుకలాగని కాస్త లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళకు మాత్రం అంతర్గత విభేదాలే కారణమని అర్ధమవుతోందట. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పెమ్మసాని అంతా తానై వ్యవహారాలు నడిపిస్తుండడం కొంతమంది ఎమ్మెల్యేలకు అస్సలు మింగుడు పడటం లేదని అంటున్నారు. అందుకే… ఆయన్ని ఎవరేమంటే మాకెందుకన్నట్టుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో… జిల్లా పాలిటిక్స్‌లో పెమ్మసాని ఒంటరి అవుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి పరిశీలకులకు. మొత్తం మీద అంబటి విమర్శలతో టీడీపీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయని, కలిసి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా… కడుపులో కత్తులు పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు జిల్లాలో.