వైసీపీ అధిష్టానం పాడుతున్న రాగమేంటి? అక్కడి నాయకులు వేస్తున్న తాళం ఏంటి? పెద్దలు ఒకటి చేయమంటే వాళ్ళు ఒకటిన్నర చేసి రచ్చ పెట్టుకుంటున్నారా? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో కోల్ట్ వార్ ఓపెనైపోయి తలలు పగలగొట్టుకున్నారా? ఎవరా ఇద్దరు నాయకులు? వాళ్ళ మధ్య వైరం ఒక నియోజకవర్గంలో పార్టీని ఎటువైపు తీసుకువెళ్తోంది?
అనంతపురం జిల్లా వైసీపీలో అగ్గి భగ్గుమంటోంది. కొద్ది రోజులు కాస్త తగ్గినట్టు కనిపించిన వర్గ విభేదాలు మళ్ళీ అంటుకున్నాయి. ముఖ్యంగా అనంతపురం అర్బన్‌లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిందంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఇక్కడ ఉన్నారు. అన్ని నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న వెంకట్రామిరెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. మొదటి నుంచి ఆయనకు వివాద రహితుడన్న పేరుంది. ఇక 24 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టిక్కెట్ కోసం వైసీపీలో చాలామంది నాయకులు ప్రయత్నించారు. కానీ… అధిష్టానం మాత్రం అనంత వెంకట్రామిరెడ్డి వైపే మొగ్గుచూపింది. అప్పటి నుంచి ఆయన వర్సెస్ అదర్స్ అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. వెంకటరామిరెడ్డి తమను అణిచివేస్తున్నారంటూ చాలామంది వైసీపీ లీడర్స్ ఆయనపై గుర్రుగా ఉన్నారు.
కొంతమంది ఓపెన్‌గా చెప్పలేకపోయినా డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి మాత్రం బయటపడిపోయారు. మాజీ ఎమ్మెల్యేని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారాయన. తనకు మేయర్ పదవి రాకుండా అడ్డుపడటంతోపాటు… ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కనివ్వలేదన్నది ఆయన కోపంగా తెలుస్తోంది. అసలు ఇప్పుడే కాదు… గతంలో కాంగ్రెస్ నుంచే తమ నాయకుడి రాజకీయ ఎదుగుదలను అనంత అడ్డుకుంటున్నారన్నది కొగటం వర్గీయుల ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా… వైసిపి హయాంలో జరిగిన ఒప్పందం మేరకు తాను మేయర్ కావాలని ప్రయత్నించారట డిప్యూటీ మేయర్‌గా ఉన్న కొగటం భాస్కర్ రెడ్డి. అన్ని రకాలుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి విఫలమయ్యాక ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జిల్లాలో వైసీపీ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా సాగింది.
జిల్లా అధ్యక్షుడి హోదాలో రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు వెంకట్రామిరెడ్డి. కోటి సంతకాల సేకరణ పూర్తయ్యాక 15న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ తీశారు వైసీపీ కార్యకర్తలు. సరిగ్గా ఇదే ర్యాలీలో విజయభాస్కర్ రెడ్డి, అనంత వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. మేం ముందు వెళ్లాలంటే మేమే ముందుండాలంటూ నాయకుల మధ్య వివాదం రేగింది. ఈ గొడవలో ఒక వ్యక్తి తల కూడా పగిలింది. దీంతో… ఇన్నాళ్లు జరిగిన కోల్డ్‌వార్ ఇప్పుడు ఓపెనైపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. దీనికి ఇక్కడే ఫుల్‌స్టాప్ పెట్టకుంటే… మరింత ముదిరి పుట్టి మునుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది అనంత ఫ్యాన్ కేడర్‌లో.