Virat Kohli Not played in Duleep Trophy 2024: అనంతపురం, బెంగళూరు వేదికలుగా సెప్టెంబర్ 5 నుంచి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ బుధవారం నాలుగు జట్లను ప్రకటించింది. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఆడుతారని ముందునుంచి ప్రచారం జరిగినా.. వారికి బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇద్దరు స్టారర్లకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో బీసీసీఐ సెక్రటరీ జై షా వివరణ ఇచ్చారు.
భవిష్యత్ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లకు దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చామని జై షా చెప్పారు. ‘రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లను దులీప్ ట్రోఫీ ఆడాలని మేం ఆదేశించలేం. వారికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు గమనించినట్లయితే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా దేశవాళీ క్రికెట్ ఆడడు. మేం ఆటగాళ్లను గౌరవంగా చూసుకోవాలి’ అని జై షా పేర్కొన్నారు.
Also Read: Mr Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ వచ్చేది ఆ ఓటీటీలోనే!
దేశంలో ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో రాబోయే మహిళల టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు సహకారం అందించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరింది. దీనిపై జై షా మాట్లాడుతూ… ‘బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసినమాట వాస్తవమే. అయితే వీలుకాదని చెప్పేశాం. టోర్నీ సమయంలో మనకు వర్షాకాలం. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. వరుస ప్రపంచ కప్‌లను నిర్వహించడం కష్టం’ అని వెల్లడించారు.