Mudragada Padmanabham: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాథం పొలిటికల్ రీ ఎంట్రీపై అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి.. ఆయన త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం.. ఈ సారి పోటీ కూడా చేస్తారని.. లేదా ఆయన కుటుంబంలో ఎవరికైనా టికెట్ దక్కే అవకాశం ఉందనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, అనూహ్యంగా ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారట బొలిశెట్టి.. అయితే, పవన్ కల్యాణ్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ చెప్పినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టికి ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. రెండు, మూడు రోజుల్లో ముద్రగడను పవన్‌కల్యాణ్ కలుస్తారనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు.. నేడు ముద్రగడను కలవబోతున్నారట టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. టీడీపీ-జనసేన కూటమిలోకి ఆయన్ని ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా మరోసారి ముద్రగడ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.
Read Also: Astrology: జనవరి 11, గురువారం దినఫలాలు
కాగా, ఈ మధ్యే కాపు నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి స్పష్టంగా అర్థమవుతోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించిన విషయం విదితమే.. తాను గౌరవించే కాపు పెద్దలు తనను ఎంతగా దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానని తెలిపారు. తనను ఎంతగా దూషించినప్పటికీ వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి.. కాపులనే వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని ఆ లేఖ ద్వారా పిలుపునిచ్చారు పవన్.. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకొచ్చే క్రమంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెర తీసిందని దుయ్యబట్టారు. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తుందని అన్నారు. కుట్రలు.. కుయుక్తలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలను కోరుతూ ఆయన లేఖ రాసిన విషయం విదితమే.