తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమలలో దర్శనంకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు. అలానే తెలంగాణలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలను కూడా ఆమోదించాలని ఏపీ సీఎంను కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మీడియా ద్వారా మనవి చేశారు. ఈరోజు తాను లేఖ రాస్తా అని, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కూడా లేఖ రాయమని విజ్ఞప్తి చేస్తా అని జగ్గారెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఏపీ సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Magnus Carlsen: విశ్వనాథన్ ఆనంద్ అనర్హుడు.. కార్ల్‌సన్ తీవ్ర విమర్శలు!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నుంచి ప్రతివారం రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కోసం రెండు లేఖలు, రూ.300/- టికెట్‌పై ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలు తిరుమలలో అనుమతిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో లేఖతో ఆరుగురు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆమోదించే అవకాశం ఉంది.