భారత చెస్ దిగ్గజం, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్‌పై ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆనంద్ ఫిడె పదవిలో ఉండడానికి అనర్హుడని పేర్కొన్నాడు. గేమ్ నిబంధనలకు విరుద్ధంగా జీన్స్ వేసుకురావడం, మార్చుకోవాలి సూచించినా వినకపోవడంతో.. కార్ల్‌సన్‌ను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిర్వాహకులు అర్ధంతరంగా తప్పించారు. అంతేకాదు జీన్స్ వేసుకున్నందుకు 200 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించారు.
ర్యాపిడ్ టోర్నీ సమయంలో విశ్వనాథన్ ఆనంద్ వ్యవహరించిన తీరును మాగ్నస్ కార్ల్‌సన్ తప్పుబట్టాడు. ‘నాకు సంబందించిన ఘటనలో ఫిడె నుంచి సరిగా వ్యవహరించలేకపోయారు. నేను టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకున్నా. అయితే ఫిడె అధ్యక్షుడు ఆర్కాడేతో మాట్లాడే వరకు ఎదురుచూడాలని మా నాన్న చెప్పారు. ఆనంద్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినా.. ఫలితం లేకపోయింది. నిజానికి ఆర్బిటర్లకు ఎలాంటి పాత్ర లేదు. నేను నిజంగానే గేమ్ నిబంధనలను అతిక్రమించానా? అన్నది ఇక్కడ ప్రశ్న. సాధారణంగా టోర్నీలో జీన్స్‌ను అనుమతించరని చెప్పారు. సాధారణంగా అంటే.. మినహాయింపులు ఉంటాయనే కదా?’ అని కార్ల్‌సన్ పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో ఫిడె నిబంధనలను సడలించింది. జీన్స్ వేసుకున్నా క్రీడాకారులను టోర్నీలోకి అనుమతించేలా మార్పు చేసింది. దుస్తుల విషయంలో తాము కాస్త సరళంగా వ్యవహరించాలని భావించామని, ఇప్పటికీ అధికారిక డ్రెస్ కోడ్‌ను పాటించాల్సిందే అని ఫిడె అధిపతి ఆర్కాడీ ద్వొర్కోవిచ్ పేర్కొన్నాడు. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు కార్ల్‌సన్ పాల్గొంటున్నాడని ఆయన స్పష్టం చేశాడు.