Jaganmohan Rao CID Investigation: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సీఐడీ కార్యాలయంలో హెచ్‌సీఏ నిందితుల విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు ఐదుగురు నిందితులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా జగన్మోహన్ రావు దొడ్డిదారిన ఎన్నికైనట్లు సీఐడీ గుర్తించింది.
హెచ్‌సీఏ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రావు 23 ఇన్‌స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇన్‌స్టిట్యూషన్స్ తరఫున ప్రతినిధులను ఓటింగ్‌కు అర్హులుగా కమిషన్ చేసింది. నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్టు సీఐడీ గుర్తించింది. గత హెచ్‌సీఏ ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేశారో వారిని విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. 23 ఇన్‌స్టిట్యూషన్స్ ఓట్ల వల్లనే జగన్మోహన్ గెలిచినట్లు గుర్తించింది. ఎవరి ఒత్తిడితో ఓట్లు వేశారు అనే కోణంలో సీఐడీ విచారణ జరుపుతోంది.
Also Read: Lal Darwaza Bonalu: పచ్చి కుండపై రంగం భవిష్యవాణి, గావు పట్టే కార్యక్రమం!
ఉప్పల్ స్టేడియంలో స్వాధీనం చేసుకున్న రికార్డ్స్‌ను సీఐడీ వెరిఫై చేస్తోంది. క్యాటరింగ్‌కు ఎలాంటి టెండర్లు లేకుండానే తమ అనుకూల సంస్థకు కేటాయించినట్టు గుర్తించింది. ఒక్కో ప్లేట్‌పై 2 వేల రూపాయలు బిల్ వేసి.. వాటికి హెచ్‌సీఏ నిధులు చెల్లించినట్టు ఆధారాలు సేకరించారు. 2024లో చెల్లించిన పవర్ బిల్స్ సైతం సీఐడీ చెక్ చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న పవర్ బిల్ చెల్లించలేదని గతంలో మ్యాచ్ సమయంలో స్టేడియం విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. వీటితో పాటు నిందితుల ఇళ్లలో సీఐడీ సోదాలు నిర్వహించింది. రేపు నిందితులను కోర్టులో సీఐడీ హాజరుపర్చనుంది.