Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కృష్ణా నదీ జలాల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనాన్ని తీవ్రంగా విమర్శించారు. గత రెండు నెలలుగా తమ పార్టీ చెబుతోన్న వాదనల్ని ఇప్పుడు కృష్ణా బోర్డు కూడా సమర్థించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అక్రమంగా 65 టీఎంసీల నీటిని తీసుకెళ్లిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లను అక్రమంగా తరలిస్తుందన్న విషయం మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. కానీ, ఇప్పుడే కృష్ణా బోర్డు చెప్పడంతో మా మాటకు న్యాయం జరిగినట్లైందని అన్నారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏదో చంద్రబాబుతో లోపాయికీ ఒప్పందం చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పైరవీలు నమోదు చేయకుండా మౌనంగా ఉండటం వెనుక కారణం ఇదే కావచ్చని మండిపడ్డారు. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ అంశంపై ఒక్క రివ్యూకూడా చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజలు మళ్లీ పాత రోజులకు, దరిద్రాలకు వస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని.. ఆయన ప్రజలను ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ అంశంపై త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ కార్యచరణ ప్రకటిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.