Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. 2022 నవంబర్‌లో ఆమె విదేశాలకు వెళ్లేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సవరించింది.అదనపు సెషన్స్ జడ్జి (ASJ) శైలేందర్ మాలిక్ వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విదేశాలకు వెళ్లడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును సవరించాలని కోరుతూ దరఖాస్తును అనుమతించారు. విదేశాలకు ప్రయాణం అవ్వడానికి మూడు రోజుల ముందు కోర్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలియజేయాలని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గత ఏడాది నవంబర్‌లో బెయిల్ పొందారు. అయితే కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో అప్పుడు బెయిల్ ఇచ్చింది.
Read Also: Pawars Secret Meeting: బాబాయ్, అబ్బాయ్‌ల రహస్య భేటీపై కాంగ్రెస్ ఆందోళన.. సుప్రియా సూలే స్పందన
ప్రస్తుత కేసులో జాక్వెలిన్ విదేశాలకు వెళ్లేందుకు ఇంతకుముందు ఐదు పర్యాయాలు ముందస్తు అనుమతి తీసుకున్నారనేది రికార్డు విషయమని కోర్టు పేర్కొంది. జాక్వెలిన్ బెయిల్ స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, బెయిల్ ఆర్డర్‌లోని ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని ఈడీ తెలిపినట్లు సమాచారం. జాక్వెలిన్ విదేశాలకు వెళ్లడానికి సంబంధించిన సమాచారంలో తాను వెళ్లే దేశం, వివరాలు, ఆమె ఉంటున్న ప్రదేశం, సంప్రదింపు నంబర్ మొదలైన ఇతర వివరాలను తెలియజేయాలని కోర్టు పేర్కొంది. తాను నటి కావడంతో షూటింగ్ నిమిత్తం తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టుకు విన్నవించింది. కొన్నిసార్లు తక్కువ సమయంలోనే విదేశాలకు వెళ్లేందుకు ఒప్పుకోవాల్సి వస్తోందని, లేదంటే వృత్తిపరమైన అవకాశాలను కోల్పోతానని తెలియజేసింది. వీటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు గతంలో ఇచ్చిన మినహాయింపులను జాక్వెలిన్ దుర్వినియోగం చేయలేదని గుర్తించిన న్యాయస్థానం ఆమెకు సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.