గత కొన్ని రోజులుగా హెటిరోపై ఐటీశాఖ చేస్తున్న దాడులతో… దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. కోట్లకు కోట్ల రూపాయల నోట్లకట్టలు.. చూసి షాకవడం అధికారుల వంతైంది. హెటిరో సంస్థల్లో దొరికిన డబ్బును లెక్కపెట్టడానికే ఐటీ అధికారులకు రెండ్రోజులు పట్టిందంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. డబ్బునంతా అట్టపెట్టలు, ఇనుప బీర్వాల్లో దాచిపెట్టారని చెబుతున్నారు ఐటీ అధికారులు. కేవలం డబ్బును దాచిపెట్టడం కోసమే హెటిరో సంస్థ… కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిందంటేనే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దొరికిన డబ్బులో అధికారులు ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే సీజ్ చేశారని, 30 ప్రాంతాల్లో ఈ సొమ్మును కనిపెట్టారని తెలుస్తోంది. ఒక్కో బీరువాలో దాదాపు ఐదు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు ఉన్నాయని తేల్చారు అధికారులు. ఒక ప్రాంతంలో, ఒకేచోట 142 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.
కరోనా సమయంలో జనాలు అల్లాడిపోతుంటే.. కొన్ని ఫార్మా కంపెనీలు మాత్రం డబ్బులు కాజేయడంలో బిజీగా ఉన్నాయనే విషయం.. హెటిరో ఇష్యూతో అర్థమవుతోంది. కొవిడ్ సమయంలో రెమిడిసివర్ డ్రగ్‌ను సేల్ చేసింది హెటిరో. మరికొన్ని మెడిసిన్స్‌ను కూడా తయారు చేసి అమ్మింది. ఎక్కడ దాచిపెట్టాలో తెలియనంతగా డబ్బు సంపాదించింది. వచ్చిన ప్రతీ నోట్ల కట్టనూ ఇనుప బీర్వాల్లోపెట్టి, తమ సంస్థ కార్యాలయాలు, ప్లాంట్లు, ఫ్యాక్టరీల్లో భద్ర పర్చింది. ఆరు రాష్ట్రాల్లో 60 చోట్ల నాలుగు రోజులపాటు సోదాలు చేసిన ఇన్‌కమ్‌టాక్ష్ డిపార్ట్ మెంట్ .. హెటిరో అక్రమ సంపద గుట్టునంతా బయటకు లాగింది. కరోనాకు వైద్యం పేరుతో జనం మీద పడి దోచుకున్నారని తేల్చింది.
హెటిరో సంస్థపై ఐటీ దాడులు, ఆ తర్వాత బయటపడ్డ నోట్ల కట్టలను చూసిన జనం నోరెళ్లబెడుతున్నారు. కరోనాలో ఆదాయం లేక సామాన్యుడు అవస్థలు పడుతుంటే, ఫార్మసీ కంపెనీలు ఇంతలా దోచుకున్నాయా? అని అవాక్కవుతున్నారు. మందుల పేరుతో జనం రక్తమాంసాలను డబ్బుగా మార్చుకుని బీర్వాల్లో దాచిపెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.