బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. “నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వంద రోజుల పాలనలో తెలంగాణ లో అద్భుతమైన పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలన ను ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. మేము వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గం..నేను ప్రస్తుతం కుటుంబం తో దైవదర్శనం చేసుకివడానికి వేరే రాష్ట్రానికి వచ్చాము.. రేపు సాయంత్రం హైదరాబాద్ కు వస్తాం. వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు తగిన జవాబు చెప్తాను.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
READ MORE: US: జార్జియాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
కాగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం, మంత్రులు వసూల్లకు పాల్పడుతున్నారంటూ లోక్ సభ ఎన్నికల ప్రచార వేళ ప్రధాని మోడీ సహా.. బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. కొత్తగా రాష్ట్రంలో మరో ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కీలక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. రైతుల ధాన్యం కొనుగోలు రచ్చ కొనసాగుతున్న వేళ.. క్వింటాకు 10 నుంచి 12 కేజీలు అదనంగా జోకుతూ (తూకం) దోచుకుంటున్నారని బిజెఎల్పీ నేత మహేశ్వరెడ్డి ఆరోపించారు. ఏటా కొనుగోలు అయ్యే కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పోల్చితే దాదాపు 13 వేల మెట్రిక్ టన్నులు దోచుకున్నట్లేనని.. ఇలా వందల కోట్ల రూపాయలు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబుల్లోకి వెళ్లినట్లు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.