2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం అని డాక్టర్ ఎస్.సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్‌ను కూడా మరో 2,3 మాసాల్లో ప్రయోగిస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన నిసార్ ఉపగ్రహన్ని కూడా నింగిలోకి పంపనున్నామని సోమనాథ్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి రాత్రి రాత్రి 10:05కి నింగిలోకి దూసుకెళ్లనుంది.
పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. నేటి రాత్రి 9:58కి ఉన్న రాకెట్ ప్రయోగ సమయాన్ని రాత్రి 10:05కి మార్చారు. ప్రస్తుతం రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రయోగం సందర్భంగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్ డా.సోమనాధ్ పూజలు చేశారు. అనంతరం ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ… ‘ఈరోజు రాత్రి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ రాకెట్‌లో ప్రయోగించే స్పాడెక్స్ ఉపగ్రహం ఒక ప్రత్యేకమైనది. ఈ ప్రయోగంలో రెండు ఉపగ్రహాలను అమర్చి నింగిలోకి పంపుతున్నాం. స్పేస్ డాకింగ్ అనే సరికొత్త టెక్నాలజీ కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది’ అని చెప్పారు.
‘ ఈ ప్రయోగంలోని నాలుగో దశలో 24 ఉపకరణాలు అమర్చి 24 పరిశోధనలు చేపట్టనున్నాం. జనవరిలో నావిక్ ఉపగ్రహాన్ని పంపుతాం. 2025 మార్చిలోగా జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15, పీఎస్‌ఎల్‌వీ సీ61, జీఎస్‌ఎల్‌వీ ఎంకే3 ప్రయోగాలు చేపడతాం. గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్‌ను కూడా మరో రెండు, మూడు మాసాల్లో ప్రయోగిస్తాం. అమెరికాకు చెందిన నిసార్ ఉపగ్రహన్ని నింగిలోకి పంపనున్నాం. 2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.