Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుండి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో పాటు, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం, పోర్టులు, సాంకేతిక, మౌళిక రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారం కోరనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Read Also: Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
గతంలో అమరావతి స్టార్టప్ ఏరియా 1671 ఎకరాల్లో సింగపూర్ ప్రభుత్వం, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ పేరుతో సీఆర్డిఏ – సింగపూర్ ప్రభుత్వం కలిసి అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అయితే.. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో… అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ది నుండి సింగపూర్ ప్రభుత్వం, ఆ దేశ సంస్థలు తప్పుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది. కోర్ క్యాపిటల్ అభివృద్ధి, అమరావతి స్టార్టప్ ఏరియాపై ప్రత్యేక దృష్టి పెట్టె విధంగా సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరపనుంది ఏపీ సర్కార్.
Read Also: CM Revanth Reddy : పేదవాడికి రేషన్ కార్డు అతని గౌరవానికి ప్రతీక
రాజధాని పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ కాంప్లెక్స్, హైకోర్టు, అసెంబ్లీ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. అమరావతి ఎక్కడ నిలిచిపోయిందో… అక్కడ్నుంచే తిరిగి ప్రారంభించారు. నిర్మాణం కోసం కేంద్రం అనేక రకాలుగా సహాయసహకారాలు అందిస్తోంది. దీంతో అమరావతి నిర్మాణంలో తిరిగి భాగస్వామి కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు నేరుగా సింగపూర్ వెళ్లి అక్కడి ప్రభుత్వ అధినేతలను కలవనున్నారు. అలాగే అక్కడి ప్రభుత్వరంగ కంపెనీలతో భేటీ కానున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాజకీయ, వ్యాపార వర్గాలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. అమరావతి నగర ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌళిక వసతుల కల్పన, భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి విషయాల్లో చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Star Hospitals : హైదరాబాద్‌లో ‘హార్ట్ ఫెయిల్యూర్’ క్లినిక్ ప్రారంభం
గత అనుభవాల నేపథ్యంలో… అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం తిరిగి భాగస్వామ్యం అయ్యే అంశంపై చంద్రబాబు పర్యటనలో క్లారిటి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం టూర్ తర్వాత సింగపూర్ ప్రతినిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఆ మీటింగ్ తర్వాత సింగపూర్ సహకారం, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది.