MLA Lasya Nanditha Dies: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓఆర్‌ఆర్‌లోని సుల్తాన్ పూర్ వద్ద కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకుని పరిశీలించారు.
మేడ్చల్ నుంచి పటాన్‌చెరువు వస్తుండగా ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదంకు గురైంది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు అది తప్పి ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో.. ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోకవడంతోనే చనిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌ను మదీనాగూడ శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: IND vs ENG: నేటి నుంచే భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు.. తుది జట్లు, పిచ్ రిపోర్ట్ ఇవే!
ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో బీఆర్‌ఎస్ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా.. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయం అయింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.