IND vs ENG 4th Test Prediction: అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆరంభం కానుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్ సాధించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. రాంచిలో బంతి బాగా తిరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇరు జట్ల బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నదే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్ జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ జట్టుకు బలం. చెలరేగి ఆడుతున్న జైస్వాల్ వరుసగా రెండు ద్విశతకాలతో చెలరేగాడు. రాంచిలోనూ అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లతో టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. అయితే మిడిలార్డరే అనుభవలేమితో ఉంది. రజత్ పటిదార్ రెండు మ్యాచ్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. పటిదార్‌కు మరో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి. గత మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదాడు. రవీంద్ర జడేజా సెంచరీ మిడిలార్డర్‌ను నిలబెట్టింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు. అందరూ మరోసారి చెలరేగాలని జట్టు ఆశిస్తోంది.
బౌలింగ్‌లో అత్యంత కీలకమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత్ విశ్రాంతినిచ్చింది. బుమ్రా గైర్హాజరీలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. రెండో పేసర్ స్థానం కోసం ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ మధ్య పోటీ ఉంది. అయితే ఆకాశ్‌కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్పిన్ వికెట్ కాబట్టి ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ బరిలోకి దిగడం ఖాయం.
Also Read: MLA Lasya Nanditha: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!
బజ్‌బాల్ వ్యూహంతో ఇంగ్లండ్ విమర్శలపాలైంది. మిడిల్ ఆర్డర్ పుంజుకోవడం ఆ జట్టుకు చాలా అవసరం. కీలక బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్‌స్టోల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. క్రాలీ, డకెట్, పోప్ రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ చేసే అవకాశముంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో ఓలీ రాబిన్సన్, రెహాన్ అహ్మద్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ తుది జట్టులోకి తీసుకుంది. టామ్ హార్ట్‌లీ, రూట్ స్పిన్ దాడి చేయనున్నారు.
ఈ సిరీస్‌లో గత పిచ్‌ల అన్నింటికన్నా రాంచి పిచ్ స్పిన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉండనుంది. ఈ పిచ్ మూడో రోజు నుంచి స్పిన్‌కు బాగా సహకరిస్తుందని క్యురేటర్ చెప్పాడు. మరోవైపు రాంచి పరిస్థితులు బ్యాటింగ్‌కూ అనుకూలమే. అయితే మ్యాచ్ మూడో రోజు, అయిదో రోజు జల్లులు పడే అవకాశముంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, పటిదార్, సర్ఫరాజ్, జురెల్, జడేజా, అశ్విన్, సిరాజ్, కుల్దీప్, ముకేశ్/ఆకాశ్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, హార్ట్‌లీ, బషీర్, రాబిన్సన్, అండర్సన్.