ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వేలం తేదీని బీసీసీఐ ప్రకటించనుంది. ఐపీఎల్ 2026 వేలంకు సంబంధించి ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలి. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ల రిటైన్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదులుకుంటుందని ఇటీవల నెట్టింట వార్తలు వచ్చాయి. ఏఈ నేపథ్యంలో ఎంఐ ప్రాంచైజీ స్పందించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రోహిత్ శర్మ వెళ్లనున్నట్లు వస్తున్న వదంతులకు ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది. ఫ్రాంచైజీతో రోహిత్ అనుబంధం కొనసాగుతుందని ఓ పోస్ట్ చేసింది. ‘రేపు సూర్యుడు మరలా ఉదయిస్తాడు. కానీ నైట్ ఉదయించడం కష్టం మాత్రమే కాదు.. అసాధ్యం కూడా’ అని ముంబై ఇండియన్స్ పేర్కొంది. కోల్‌కతాకు రోహిత్ వెళ్లడు అనే అర్థం వచ్చేలా పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. రోహిత్ మరో సీజన్ జట్టులో కీలకపాత్ర పోషిస్తాడని తెలిపింది. ఈ విషయం తెలిసి రోహిత్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Jammu and Kashmir History: జమ్మూ కాశ్మీర్ చరిత్ర.. 65 ఏళ్ల తర్వాత విజయం!
ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా కూడా స్పందించాడు. ‘ముంబై ఇండియన్స్ కచ్చితంగా రోహిత్ శర్మను రిటైన్ చేసుకుంటుంది. ముంబై కోసం రోహిత్ ఎన్నో ట్రోఫీలు గెలిచాడు. ఆ అంచనా ప్రకారం దీపక్ చహర్‌ను వదులుకోవచ్చు. రిటైన్ కూడా చేసుకోవచ్చు. ట్రెంట్ బౌల్ట్‌ను కూడా జట్టు రిటైన్ చేసుకుంటే బెటర్. అతడు అద్భుతమైన బౌలర్. వేలంలో మంచి ఆటగాళ్లను పొందే అవకాశాలు లేవు కాబట్టి కచ్చితంగా నిలుపుకోవాలి’ అని రైనా పేర్కొన్నాడు.