భారత్‌లో తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు తాను చూస్తుంటా అని శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ తెలిపాడు. పుష్ప సినిమా బాగుందని, అప్పటి నుంచి తాను ఎక్కువగా తెలుగు చిత్రాలు వీక్షిస్తున్నానని చెప్పాడు. మైదానంలో పుష్ప తరహాలో సంబరాలు చేసుకోవడం బాగుందని హసరంగ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ శివమ్ దూబెను ఔట్ చేసిన అనంతరం పుష్ప స్టైల్‌లో రాజస్థాన్ సిన్నర్ హసరంగ సంబరాలు చేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం పుష్ప స్టైల్‌లో సంబరాలు చేసుకోవడంపై వనిందు హసరంగ స్పందించాడు. ‘శివమ్ దూబె డేంజరస్ బ్యాటర్. మ్యాచును ఇట్టే మలుపు తిప్పుతాడు. అందుకే అతడు ఔటైన తర్వాత పుష్ప తరహాలో సంబరాలు చేసుకున్నా. అలా చేసుకోవడం బాగుంది. భారత్‌లో నేను తెలుగుతో పాటు మలయాళం, తమిళ సినిమాలు కూడా చూస్తుంటా. ముఖ్యంగా పుష్ప నుంచి ఎక్కువగా వీక్షిస్తున్నా. అందుకే సంబరాలు అలా చేసుకున్నా’ అని హసరంగ చెప్పాడు. రాజస్థాన్ విజయం సాధించడంలో హసరంగ కీలక పాత్ర పోషించాడు. చెన్నపై 35 పరుగులు ఇచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: MS Dhoni-Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌ను పరామర్శించిన ఎంఎస్ ధోనీ!
‘ప్రాథమిక అంశాలకు కట్టుబడి బౌలింగ్ చేస్తాను. ఈ మ్యాచ్‌లో స్టంప్స్‌ను లక్ష్యంగా బంతులు వేశాను. కొన్ని బంతులను వికెట్లకు దూరంగా కూడా వేశా. మా బ్యాటర్లు మంచి స్కోరు చేయడంతో మా పని తేలికైంది. రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీయడంను ఆస్వాదించా. మాకు అద్భుతమైన బౌలింగ్ ఉంది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేసున్నాం. మ్యాచ్ అన్నాక వేర్వేరు పాత్రలను పోషించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొత్త బంతితో, కొన్నిసార్లు పాత బంతితోనూ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది’ అని వనిందు హసరంగ తెలిపాడు.